
సాక్షి,హైదరాబాద్: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. బైక్‌లను దొంగిలించాడనే నెపంతో ఓ దొంగను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం జరిగింది. బైక్ దొంగతనం చేయబోయిన ఇద్దరు యువకుల్లో ఒకరిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు. పార్క్ చేసిన బైక్‌లను చోరీ చేసి మార్కెట్‌లో అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో ఓ బైక్‌ను దొంగతనం చేశారు. దొంగతనానికి వస్తూ వస్తూ..అక్కరకొస్తుందని ఓ బాటిల్ పెట్రోల్‌ను వెంట తెచ్చుకున్నారు.
అయితే దొంగిలించిన బైక్‌లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్య పప్రాంతానికి తీసుకెళ్లి బండిలో పెట్రోల్ నింపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బండిని కొంతదూరం నెట్టుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళుతున్న యువకులు బైక్ చోరీ చేసిన నిందితుల్ని గుర్తించారు. యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మహిపాల్ పరారయ్యాడు. యవాన్‌ను స్తంభానికి కట్టారు. అతని జేబులో ఉన్న పెట్రోల్‌ను తీసుకుని తగలబెట్టారు. యవాన్ 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. యవాన్‌పై దారుణానికి తెగబడ్డ గ్రామస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.