కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్‌ రియాక్షన్‌ | Aadi Srinivas Reaction To Kavitha Letter To Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్‌ రియాక్షన్‌

May 22 2025 8:32 PM | Updated on May 22 2025 8:41 PM

Aadi Srinivas Reaction To Kavitha Letter To Kcr

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.

‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు.

..కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement