నైరోబి: మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెన్యా మహిళా అథ్లెట్ రుత్ చెప్‌నెటిక్ డోపింగ్‌లో దొరికిపోయింది. దీంతో అథ్లెట్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం చికాగో మారథాన్‌లో చెప్‌నెటిచ్ విజేతగా నిలిచింది. 2023లో అమెరికాలో జరిగిన ఈ సుదీర్ఘ పరుగును ఆమె 2 గంటల 9 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గత రికార్డు టైమింగ్ కంటే 1 నిమిషం 57 సెకన్ల ముందే పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.
అయితే ఈ ఏడాది మార్చిలో ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో జూలైలోనే ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. తదుపరి ఏఐయూ విచారణలో ఆమె తను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని వివరణ ఇచ్చింది. నమూనాల సేకరణకు కొద్ది రోజుల ముందే తాను అస్వస్థతకు గురైనపుడు పనిమనిషి ఇచి్చన మందు వల్లే ఉ్రత్పేరకాలు అందులో ఉండొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించిన ఔషధం ఫొటోనూ ఏఐయూకు సమర్పించింది.
అయితే ఓ ప్రొఫెషనల్ అథ్లెట్ అయివుండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదిపడితే అది వాడటం నిర్లక్ష్యం కిందకే వస్తుంది తప్ప... శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీలుండదని ఏఐయూ మందలించింది. నాలుగేళ్ల నిషేధం విధించాల్సిన చోట, ఆమె తప్పు ఒప్పుకోవడంతో మూడేళ్ల నిషేధాన్ని ఖరారు చేసింది. ఈ ఏప్రిల్ 19 నుంచే ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ వెల్లడించింది.


