మారథాన్...
కొత్త దారి
కాస్త సరదాగా... తొలిసారిగా మారథాన్‌లో పాల్గొన్న ఈ డాక్టర్ దంపతులు ఆ తరువాత మాత్రం ‘మారథాన్’ను సీరియస్‌గా తీసుకున్నారు. ఏడు ఖండాలలో జరిగిన మారథాన్‌లలో పాల్గొని ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు కొల్ల సుధాకర్, తులసి దంపతులు. వారి మారథాన్ అనుభవాలు వారి మాటల్లోనే...
‘‘మా బాబు అద్వైత్ హైదరాబాద్‌లో చదువుకునే రోజుల్లో మేము వెళ్లి వస్తూ ఉండేవాళ్ళము. ఆ సమయంలో హైదరాబాద్‌లో జరిగిన హాఫ్‌మారథాన్‌లో పాల్గొనడానికి దిల్లీ నుంచి ఒక మహిళ రావడం మాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆమెతో మాట్లాడిన తరువాత ఇక రెగ్యులర్‌గా మారథాన్‌లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం.
సిక్స్ స్టార్స్ ఫినిషర్స్
బెర్లిన్‌లో 2018లో జరిగిన మారథాన్‌లో మేము ఇద్దరం మొదటిసారిగా పాల్గొన్నాము. మూడు సంవత్సరాల మా సాధన అక్కడ బాగా పనిచేసింది. 42.2 కిలోమీటర్లు నిర్వహించే మారథాన్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి ప్రజలు దారి ΄÷డవునా నిల్చుని చప్పట్లతో ప్రోత్సహించడం సంతోషాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత 2019 న్యూయార్క్‌లో, 2022లో బోస్టన్‌లో, చికాగోలో, 2023లో లండన్‌లో, 2024లో టోక్యోలో జరిగిన మారథాన్‌లలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశాము. ఆరు మారథాన్‌లను పూర్తి చేసుకున్న మాకు టోక్యోలో 6స్టార్స్ ఫినిషర్స్ పతకాలను అందజేశారు.
అంటార్కిటికాలో... అంత ఈజీ కాదు!
అంటార్కిటికా ఖండంలో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అక్కడి చలి తీవ్రతను తట్టుకోవడానికి నాలుగు లేయర్ల దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక షూస్ వేసుకుని వాకింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటివరకు ఏడు ఖండాలలో మారథాన్‌లను పూర్తి చేశాం, అందులో యూరప్‌లోని బెర్లిన్, ఉత్తర అమెరికాలోని న్యూయార్క్, చికాగో, బోస్టన్ ఆసియాలో టోక్యో, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, అంటార్కిటికా ఖండం, దక్షిణ అమెరికాలోని పెటగోనియా, దక్షిణ ఆఫిక్రాలోని కేప్‌టౌన్‌లలో జరిగిన మారథాన్‌లలో పాల్గొన్నాము.
నిత్య సాధనతో...
మారథాన్‌లో పాల్గొనడానికి నాలుగు నెలల ముందు నుంచే ప్రత్యేక సాధన చేస్తాము. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తాం. స్వీట్లు, జంక్ ఫుడ్ మా దరిదాపుల్లోకి రానివ్వము. పూర్తి కార్బోహైడ్రేట్లు ఉండే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటాము. ప్రతిరోజు 8 నుంచి 10 కిలో మీటర్లు నడుస్తాం. మారథాన్ కు ముందు రోజు 20 కిలోమీటర్లు పరుగెత్తుతాము. నిత్యసాధన చేసినప్పుడే మారథాన్‌లో పూర్తి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము’’ అని వివరించారు డాక్టర్ దంపతులు.
మారథాన్‌ను నేడు మూడు కేటగిరీలుగా నిర్వహిస్తున్నారు. 1. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం వద్ద ఉదయం 5.30 గంటలకు హాఫ్ మారథాన్ రన్ ప్రారంభం అవుతుంది. అలాగే ఆరుగంటలకు 10 కి.మీ., 7 గంటలకు 5 కి.మీ. మారథాన్‌లు జరగనున్నట్లు, మూడు బ్యాచీలు కాళోజీ కళాక్షేత్రం నుంచి ప్రారంభమై తిరిగి కళాక్షేత్రం వద్దకు చేరుకుంటాయని నిర్వాహకులు తెలియజేశారు.
వారి కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
ఏమాత్రం వాకింగ్ చేయకుండా గంటల తరబడి టీవీ, ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు కొద్దిమంది. అలాంటి వారిని కౌచ్ అంటారు. వారిని మారథాన్‌లో పాల్గొనేలా చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. 45 రోజుల్లో 5 కిలోమీటర్ల దూరం స్పీడ్ వాక్ చేసేలా వారికి శిక్షణ ఇస్తాం. మరో పది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తాం.
– కొల్ల సుధాకర్, తులసి
– గజ్జి రమేష్, సాక్షి, వరంగల్,
ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్


