ఆయుర్వేద వైద్యులు 58 రకాల సర్జరీలు చేయడానికి ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం
ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్
ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ వెల్లడి
ఆయుర్వేదం వైద్యాన్ని అసలైన రూపంలో ప్రోత్సహించాలని డిమాండ్
ఆధునిక వైద్యంతో కలిపి మిక్సోపతి చేయవద్దని అల్లోపతి వైద్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు (సర్జరీలు) చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం ప్రకటించింది. ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు స్వతంత్రంగా చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఈ నెల 23న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.
వాటిలో 39 శల్యతంత్ర(సాధారణ శస్త్ర చికిత్సలు), 19 శలాక్య తంత్ర(ఈఎన్‌టీ, నేత్ర, దంత వంటి ఇతర) శస్త్రచికిత్సలు ఉన్నాయి. పురాతన వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో అల్లోపతి వైద్యులు మండిపడుతున్నారు.
స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ పి.భన్సాలీ ఇప్పటికే ప్రకటించారు. తమకు ఆయుర్వేద, హోమియోపతి వైద్య ప్రక్రియలపై గౌరవం ఉందన్నారు. ఆయుర్వేదం దాని అసలైన, స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలని, ఆధునిక వైద్యంతో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. సరైన శిక్షణ లేని వారు సర్జరీలు చేస్తే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అల్లోపతి, ఆయుర్వేద, వివిధ వైద్య విధానాలను కలిపి మిక్సోపతి చేస్తే వైద్య ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపింది. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ 2020లోనే మార్గదర్శకాలు ఇచ్చింది. అప్పట్లోనే దీన్ని అల్లోపతి వైద్యులు దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు సైతం చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన విచారణకు రానుందని ఐఎంఏ చెబుతోంది.
అనుసంధానం చేయవద్దు
అల్లోపతి, ఆయుర్వేదం హోమియోపతి వైద్య విధానాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో తప్పులేదు. అలా కాకుండా ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి మిక్సోపతి చేయవద్దు. ఇలా చేస్తే వైద్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మోడ్రన్ మెడిసిన్ వైద్యులకు అనాటమీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీలో నైపుణ్యం ఉంటుంది. వీటిపై ప్రాచీన వైద్య విద్య అభ్యసించిన వారికి అవగాహన తక్కువ ఉంటుంది. ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని అనుసంధానం చేయడం సరికాదు. – డాక్టర్ ఎస్.బాలరాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు


