– ఓ తండ్రి కథ
మంగళూరుకు చెందిన మాధవ్ సరిపెల్ల ఆటోరిక్షా డ్రైవర్. 68 సంవత్సరాల మాధవ్ ఇప్పటికీ మారథాన్‌లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 100 మారథాన్‌లు పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాధవ్ కుమారుడు ధనరాజ్ ప్రతిభావంతుడైన స్కేటర్. ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. చైనాలో జరిగిన పోటీలో పాల్గొన్న మాధవ్ తీవ్రంగా గాయపడి ఆటలకు దూరం అయ్యాడు.
‘నాన్నా, నేను ఆటలకు దూరం అయ్యాను. నువ్వు దగ్గర కావాలి’ అని ధనరాజ్ అడిగాడో లేదో కానీ కేవలం కుమారుడి కళ్లలో వెలుగు చూడడానికే మారథాన్‌లలో పాల్గొనేవాడు మాధవ్. తండ్రి పతకం గెల్చుకున్నప్పుడల్లా తానే గెలిచినంతగా సంతోషించేవాడు కుమారుడు.
తాజా విషయానికి వస్తే... ఈ నెల 9న జరిగే ‘మంగళూరు మారథాన్ 2025’ కోసం సాధన చేస్తున్నాడు మాధవ్. ‘ఆటో నడపడం తప్పనిసరి కాబట్టి ప్రాక్టీసింగ్ కు నాకు పెద్దగా సమయం దొరకదు. అయినప్పటికీ వారానికి మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను.
2.45 గంటల్లో 20 కిలోమీటర్‌లకు పైగా పరుగెత్తాను’ అంటున్నాడు మాధవ్. మాధవ్ బతుకు బండి భారంగానే కదులుతోంది. కుమార్తె నందిని దివ్యాంగురాలు. తన ఇంట్లో కొంత భాగం కూలిపోయింది... కష్టాల సంగతి ఎలా ఉన్నా మారథాన్‌లో పాల్గొనడం అంటే తనకు ఇష్టం. ఎందుకంటే తనను పోటీల్లో చూడడం, విజేతగా చూడడం కుమారుడికి ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి!


