breaking news
autorickshaw driver
-
శతమారథానుడు
మంగళూరుకు చెందిన మాధవ్ సరిపెల్ల ఆటోరిక్షా డ్రైవర్. 68 సంవత్సరాల మాధవ్ ఇప్పటికీ మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 100 మారథాన్లు పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాధవ్ కుమారుడు ధనరాజ్ ప్రతిభావంతుడైన స్కేటర్. ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. చైనాలో జరిగిన పోటీలో పాల్గొన్న మాధవ్ తీవ్రంగా గాయపడి ఆటలకు దూరం అయ్యాడు.‘నాన్నా, నేను ఆటలకు దూరం అయ్యాను. నువ్వు దగ్గర కావాలి’ అని ధనరాజ్ అడిగాడో లేదో కానీ కేవలం కుమారుడి కళ్లలో వెలుగు చూడడానికే మారథాన్లలో పాల్గొనేవాడు మాధవ్. తండ్రి పతకం గెల్చుకున్నప్పుడల్లా తానే గెలిచినంతగా సంతోషించేవాడు కుమారుడు.తాజా విషయానికి వస్తే... ఈ నెల 9న జరిగే ‘మంగళూరు మారథాన్ 2025’ కోసం సాధన చేస్తున్నాడు మాధవ్. ‘ఆటో నడపడం తప్పనిసరి కాబట్టి ప్రాక్టీసింగ్ కు నాకు పెద్దగా సమయం దొరకదు. అయినప్పటికీ వారానికి మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను. 2.45 గంటల్లో 20 కిలోమీటర్లకు పైగా పరుగెత్తాను’ అంటున్నాడు మాధవ్. మాధవ్ బతుకు బండి భారంగానే కదులుతోంది. కుమార్తె నందిని దివ్యాంగురాలు. తన ఇంట్లో కొంత భాగం కూలిపోయింది... కష్టాల సంగతి ఎలా ఉన్నా మారథాన్లో పాల్గొనడం అంటే తనకు ఇష్టం. ఎందుకంటే తనను పోటీల్లో చూడడం, విజేతగా చూడడం కుమారుడికి ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి! -
ఆటోడ్రైవర్ సాహసం
వడోదర: మృత్యుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న యువకుడిని గుజరాత్ లో ఓ ఆటోడ్రైవర్ అత్యంత సాహసంతో రక్షించాడు. వడోదరాకు చెందిన ఆటోడ్రైవర్ గనిభాయ్ మహమ్మద్ షేక్ (52) మొసలి నోట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ముఖేష్ శుక్లాను సమయస్ఫూర్తిగా రక్షించి రియల్ హీరోగా నిలిచాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ (17) స్థానిక విశ్వామిత్ర నదిలో పడిపోయాడు. నదిలో ఉన్న మొసలి అతగాణ్ని దొరకబుచ్చుకుంది. యువకుడి ఎడమ చేయి దాని కోరల్లో చిక్కుకుని నలిగిపోతోంది.. ముఖేష్ బాధతో విలవిల్లాడుతూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. చుట్టు గుమిగూడిన జనం రాళ్లు, కర్రలతో మొసలిని కొడుతూ ఆ యువకుడిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దారిన పోతున్న మహమ్మద్ షేక్... అరుపులు, కేకలు విని ఆక్కడకు చేరాడు. మృత్యువుతో పోరాడుతున్న యువకుడ్ని చూశాడు. అంతే పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర నుంచి ఒక ఇనుప రాడ్ తెచ్చి మొసలిని కొట్టడం మొదలు పెట్టాడు. మొసలి తోక ముడిచేదాకా తన ప్రయత్నాన్ని ఆపలేదు. దాదాపు 15-20 నిమిషాల తరువాత యువకుడి చేతిని వదిలి పెట్టి మొసలి నీళ్లలోకి జారుకుంది. బాధితుడిని ఒడ్డుకు చేర్చిన జనం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అటవీ అధికారి పీబీ చవాన్ తెలిపారు. బాధితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అసలు నదిలో అతను ఎలా పడ్డాడో విచారిస్తున్నామని తెలిపారు. అయితే బ్రిడ్జిపై నుంచి ఆ యువకుడే నదిలో దూకినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. మరోవైపు ఈ నదిలో దాదాపు 100- 200 మొసళ్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.


