బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ (Nigar Sultana)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఆరోపణలపై స్పందించే విధానం ఇది కాదని.. అనవసరంగా మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పేరు వివాదంలోకి లాగితే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. భారత్- శ్రీలంక వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొత్తంగా గ్రూప్ దశలో పదకొండు మ్యాచ్‌లకు గానూ బంగ్లా జట్టు కేవలం రెండే గెలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాపై విమర్శల వర్షం కురిసింది.
జూనియర్లపై భౌతిక దాడి
అదే సమయంలో బంగ్లా పేసర్ జహనారా ఆలమ్.. నిగర్ సుల్తానాపై సంచలన ఆరోపణలు చేసింది. జట్టు సభ్యులపై నిగర్ భౌతిక దాడికి పాల్పడేదని.. జూనియర్లను ఎన్నోసార్లు గాయపరిచిందని ఆరోపించింది. ఇష్టారీతిన కొట్టేదని వాపోయింది.
బంగ్లాదేశ్ డైలీతో మాట్లాడుతూ ఆలం ఈ మేరకు నిగర్‌పై ఆరోపణలు చేసింది. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. జోటీ జూనియర్లను దారుణంగా కొట్టేది’’ అని పేర్కొంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆలం ఆరోపణలను కొట్టిపారేసింది. నిగర్ సుల్తానాపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ ఆమెను సమర్థించింది.
నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా?
ఈ నేపథ్యంలో తాజాగా.. నిగర్ సుల్తానా స్వయంగా స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి కాకుండా.. భారత మహిళా జట్టు కెప్టెన్, వరల్డ్‌కప్ విజేత హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును కూడా ఇందులోకి లాగింది. ‘‘నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? అంటే.. నా బ్యాట్‌తో స్టంప్స్‌ను ఎందుకు కొడతాను?
నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా? ఆమె మాదిరి స్టంప్స్‌ను బ్యాట్ కొట్టేదానిలా కనబడుతున్నానా? నేనెందుకు అలా చేస్తాను? నా వ్యక్తిగత విషయంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే... అప్పుడు నా బ్యాట్‌ను తిప్పుతూ కోపం ప్రదర్శిస్తానేమో.. లేదంటే నా హెల్మెట్‌ను కొట్టుకుంటానేమో? అది నా ఇష్టం.
వేరే వాళ్లను నేనెందుకు కొడతాను?
కానీ వేరే వాళ్లను నేనెందుకు కొడతాను? భౌతికంగా ఎందుకు దాడి చేస్తాను? ఎవరో ఏదో అన్నారని అందరూ ఈ విషయం గురించి నన్ను అడగటం ఏమీ బాలేదు. నిజంగా నేను ఎవరినైనా కొట్టానేమో అడగండి. వాళ్లు చెప్పింది రాసుకోండి’’ అంటూ నిగర్ సుల్తానా డైలీ క్రికెట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కాగా 2023లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ బౌలర్ నహీదా అక్తర్ బౌలింగ్‌లో హర్మన్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అప్పీలు చేయగా.. అంపైర్ హర్మన్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
నాడు హర్మన్ అలా
కానీ.. బంతి లెగ్‌స్టంప్‌నకు ఆవల పిచ్ అయిందని భావించిన హర్మన్.. తనను తప్పుడు నిర్ణయంతో బలిచేశారనే ఆవేదన, కోపంతో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బోర్డును కూడా హర్మన్ తప్పుబట్టింది.
ఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత వేయడంతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు కూడా ఆమె ఖాతాలో జమచేసింది. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది.
అయితే, ఎప్పుడో రెండేళ్ల క్రితం నాటి విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ పేరును తీయడంపై భారత జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్‌లో భారత్‌కు మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ అందించిన తమ సారథిని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్‌కు మళ్లీ పిలుపు


