దుబాయ్: మహిళా క్రికెట్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది. దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు బోర్డు తీసుకుంది.
ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.
మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.
రికార్డు రేటింగ్స్...
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్‌స్టార్‌లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్‌లో అత్యధికమని పేర్కొంది.
మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ (IND vs SA) మ్యాచ్ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్‌ను 185 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం.


