సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ (women's CWC) ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన లారా.. 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది.
తద్వారా ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్‌లో 509 పరుగులు చేసింది.
ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..
లారా వోల్వార్డ్ట్- 570 (2025)
అలైస్సా హీలీ- 509 (2022)
రేచల్ హేన్స్- 497 (2022)
డెబ్బీ హాక్లీ- 456 (1997)
లిండ్సే రీలర్- 448 (1989)
సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు
తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో లారా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలు చేసింది.
నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.
మూడో ప్రయత్నంలోనూ..
గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.
చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధా
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా


