
13 ఏళ్ల వయసులోని కోరిక,103 ఏళ్లకు తీర్చుకోబోతున్న తాతగారు
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండవ ప్రపంచ యుద్దంలోని పాల్గొన్న హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఈ ఏడాది ఆగస్టుకి 103 ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా పెంటగాన్‌లో తన బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తద్వారా 13 ఏళ్ల నాటి డ్రీమ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అసలేంటీ బార్ మిట్జ్వా? అతని కోరిక ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.
తన 102వ పుట్టిన రోజు సందర్భంగా తాతగారు ఈవిషయాన్ని ప్రకటించారు. యుక్త వయస్సులో స్వీకరించాలని కలలుగన్న బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యూదు మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్‌కు చెందిన వారు కాగా, రష్యాకు చెందిన చెండికి మతాలంటే ఇష్టం ఉండదు. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడుహెరాల్డ్ టెరెన్స్.
బార్ మిట్జ్వా అంటే ?
బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్‌మిట్జ్వా అంటారు. ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని, ‘బార్’ అనే హీబ్రూ అంటే ‘కుమారుడు’ అని అర్థం. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్‌లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా పఠిస్తారు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్‌మిట్జ్వా స్వీకరించాలని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే హెరాల్డ్ సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వాను స్వీకరించారు. తల్లి తండ్రుల విశ్వాసాల కారణంగా అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను,ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగాన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.
ఇంకో విశేషం ఏమిటంటే
గత ఏడాది 100 ఏళ్ల వయసులో 97 ఏళ్ల జీన్ స్వెర్లిన్‌ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు. నార్మాండీలో జరిగిన వివాహం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. నీ లైఫ్‌లో అదే మధురమైందన్నాడు. లైఫ్ ఒక అందమైన కథ లాంటిది. తన జీవితాన్ని పూర్తిగా జీవించాలీ అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగు ఉండదు. కనీసం పదేళ్లు ఆయువు జోడించుకున్నట్టే అంటారాయన. ఒత్తిడి లేని జీవితం నంబర్ వన్ అయితే, రెండోది 90 శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు.
అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా టెరెన్స్ చాలా సార్లు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఇరాన్‌లో ఒక రహస్య మిషన్‌లో ఒకసారి, లండన్ పబ్‌లో జర్మన్ రాకెట్ నుండి తప్పించుకున్నాడట. తన జీవితం "ఒక పెద్ద అద్భుత కథ" అని అతను పేర్కొన్నాడు మరియు తన జీవితాన్ని పూర్తిగా జీవించాలని అనుకున్నాడు. "ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే, మీరు చాలా దూరం వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి కనీసం 10 సంవత్సరాలు జోడిస్తారు. కాబట్టి అది నంబర్ వన్. మరియు 90% అదృష్టం," అని అతను చెప్పాడు, సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి తన రహస్యాన్ని పంచుకున్నాడు.
కాగా హెరాల్డ్ టెరెన్స్ 1942లో US ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు . P-47 థండర్‌బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్‌కు రేడియో రిపేర్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. 1944లో D-డే నాడు, అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మతు చేయడంలో సహాయం చేశాడు. ఆ తరువాత నార్మాండీ నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్‌కు రవాణా చేయడంలో సహాయం చేశాడు. జూన్ 2024లో, నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది.