ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్‌గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...
ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్‌ను పిలుస్తాయి. అది కణం మరణం!
ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?
⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్‌గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం.
⇒ ఇక సెల్ డెత్‌కు కారణమయ్యే పోలీస్ ఇన్‌స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.
ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్‌కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి.
ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్‌బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్‌ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్‌డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.
అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్‌లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం.
మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీ
గతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్‌గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్‌లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్‌ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది.
కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో...
కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్‌ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్‌కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు.
ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్‌తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్‌ఎమ్‌ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్‌ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.
రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్‌కే సెల్ థెరపీ
అత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు.
అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్‌కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్‌కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్‌కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్‌ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙
⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్‌లో ఉన్న సోల్జర్‌లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్‌లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.
మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ
ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది.
ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్‌లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్‌ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్‌ను కమ్మేసి సైలెంట్‌గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.
నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్
ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.
ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు..
⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.
ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే...
⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్‌లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.
ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్‌డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ)
గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్‌ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్‌ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్‌లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు.
ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...
⇒ చాలా హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్‌నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.
నిర్వహణ: యాసీన్
డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్


