ITR Filing Last Date: నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!

ITR filing last date July 31: What Happens if ITR is not Filed - Sakshi

సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్‌లైన్‌ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. 

ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. 

► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. 
► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. 
► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్‌ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. 
► రిఫండ్‌ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్‌ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. 
► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. 
► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్‌ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. 
► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్‌మెంట్‌ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్‌ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. 
ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి.

ఇది కూడా చదవండి:  ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్‌ ఫైలింగ్‌ లాభాలు తెలుసా?
జొమాటోకు భారీ షాక్‌, ఎందుకంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top