గయ నుంచి అయోధ్య దాకా... మనోరథ వీక్షణం | From Gaya to Ayodhya, IRCTC rail yatra tourist package | Sakshi
Sakshi News home page

గయ నుంచి అయోధ్య దాకా... మనోరథ వీక్షణం

Jul 28 2025 10:55 AM | Updated on Jul 28 2025 11:11 AM

From Gaya to Ayodhya, IRCTC rail yatra tourist package

యూపీ... బిహార్‌... ఒడిశా... జార్ఖండ్‌... వెస్ట్‌బెంగాల్‌.ఈ టూర్‌లో... ఈ రాష్ట్రాలన్నింటినీ టచ్‌ చేయవచ్చు. రైలు ప్రయాణంలో మధ్యప్రదేశ్‌ కూడా పలకరిస్తుంది. గయలో విష్ణు పాదాన్ని దర్శించుకోవడంతో మొదలు. పూరీ జగన్నాథుడు...కోణార్క్‌ సూర్య భగవానుడు. గంగాసాగర కపిలమునీశ్వరుడు...కోల్‌కతాకాళిక. బైద్యనాథుడు...  విశ్వనాథుడు... బాలరాముడు. వీరంతా పర్యటన ఆద్యంతం అలరించే దైవాలు. గంగలో పాద ప్రక్షాళనం సరయులో ముఖ ప్రక్షాళనం. పర్యాటకులను పునీతభావనలో ముంచే ధార్మికతలివి. మనోరథం ఆకాంక్షలను తీర్చే రైలు రథ యాత్ర ఇది.    

1 వ రోజు : ఉదయం ఆగ్రా కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ బయలుదేరుతుంది. గ్వాలియర్, వీరాంగణ లక్ష్మీబాయ్, ఓరై, కాన్పూర్, లక్నో మీదుగా రాత్రికి అయోధ్య కంటోన్మెంట్‌ చేరుతుంది.

 2వ రోజు : భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ తెల్లవారు జాముకు కాశీకి చేరుతుంది. రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ అవడం, రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత గయలోని విష్ణుపాదం ఆలయం, స్థానిక ఆలయాల దర్శనం. రాత్రికి రైలెక్కి పూరీకి సాగిపోవడం.

ఫాల్గు తీరాన విష్ణుపాదం
విష్ణుపాద ఆలయం నిర్మాణపరంగా చాలా ప్రత్యేకం. ఇది బీహార్‌ రాష్ట్రంలో రాజధాని నగరం పట్నాకి వంద కిలోమీటర్ల దూరాన గయలో ఉంది. ఇక్కడ పిండప్రదానం చేస్తారు. రామాయణకాలంలో రాముడు, సీత ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం దేవి అహల్యాబాయ్‌ హోల్కర్‌ నిర్మించిన ఆలయం. ఆమె ఇందోర్‌ రాణి. క్రీ.శ 1787లో ఫాల్గునది తీరాన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు మంచి రాయి కోసం అన్వేషణ జరిగింది. గయ జిల్లాలోని బథని గ్రామంలోని పర్వతం నుంచి చక్కటి బ్లాక్‌ గ్రానైట్‌ని గుర్తించారు. రాజస్థాన్‌ నుంచి శిల్పకారులను రప్పించారు. ఆ శిల్పకారులు ఆలయ నిర్మాణం కోసం నివసించిన గ్రామం పేరు పత్తర్‌కట్టి. ఇప్పుడది కూడా ఒక టూరిస్ట్‌ ప్లేస్‌. గయాసురుడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి హతమార్చిన ప్రదేశం అని స్థలపురాణం. ఆ సందర్భంలో విష్ణువు తన పాదాన్ని గయాసురుడి ఛాతీ మీద పెట్టి అతడిని అదిమేశాడని, ఆ ప్రదేశంలో భూమి మీద విష్ణువు పాద ముద్ర నిలిచిపోయిందని చెబుతారు. అందుకు ఆనవాలుగా పెద్ద పాదాన్ని చూపిస్తారు. గయ అనగానే బుద్ధుడు గుర్తుకు వస్తాడు. అయితే ఆ గయ ఈ గయ ఒకటి కాదు. ఈ గయకు పదిహేను కిలోమీటర్ల దూరాన బో«ద్‌గయ ఉంది. అది బుద్ధుడికి జ్ఞానోదయమైన గయ అది. ఈ పర్యటనలో ఆ ప్రదేశాన్ని అక్కడి బోధివృక్షాన్ని, బుద్ధుని భారీ విగ్రహాన్ని, వివిధ దేశాల నమూనా బౌద్ధ చైత్యాలను చూడవచ్చు. 

3వ రోజు: మధ్యాహ్నానికి రైలు పూరీకి చేరుతుంది. జగన్నాథ ఆలయ దర్శనం, రాత్రి బస రైల్లోనే. రైలు పూరీ స్టేషన్‌లోనే ఉంటుంది.

సర్వం పూరీ జగన్నాథం
జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రం, పూరీ పట్టణంలో ఉంది. పురాణ కాలం నుంచి ఇక్కడ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితోపాటు అతడి అన్న బలభద్ర (బలరాముడు), చెల్లి సుభద్రల విగ్రహాలు పూజలందుకుంటాయి. ఇక్కడి దేవతా విగ్రహాలు రాతివి కాదు, దారు శిల్పాలు. మాల్వ రాజు ఇంద్రద్యుమ్నుడు ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు కలలో కనిపించి సముద్రంలో తేలుతూ వచ్చిన కర్రదుంగతో విగ్రహాలు చేయించమని చెప్పాడని, ఆ మేరకు రాజు బంగాళాఖాతం తీరంలో ఎదురు చూడగా ఒక వేప దుంగ కొట్టుకు వచ్చిందని, దానిని సేకరించి విగ్రహాలు తయారు చేయించాడని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణాన్ని క్రీ.శ పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన అనంతవర్మన్‌ చోడగంగ నిర్మించాడు. ఈ ఆలయంలో పూజాదికాలు నిర్వహించేది భిల్లు శబర జాతి ఆదివాసీలు. పూరీ జగన్నాథుని రథయాత్ర దేశమంతటా ప్రసిద్ధి. సర్వజన సమానత్వానికి ప్రతీక ఈ ఆలయం. కులాలు, జాతులు, పేదగొప్ప తేడా లేకుండా భక్తులంతా సమానమే. ఈ ఆలయం గొప్పదనం పాటించడం. అయితే ఈ ఆలయంలోకి హిందూయేతరులకు ప్రవేశం ఉండదు. విదేశీయులతోపాటు భారతీయ జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా ప్రవేశం నిషిద్ధమే. ఈ విషయమై అనేక చర్చలు, వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. కొన్ని నియమాలననుసరించి ప్రవేశం కల్పించవచ్చనే సడలింపు ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ అవేవీ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు.

 4 వరోజు : కోణార్క్‌ ఆలయ దర్శనం తర్వాత రైలు కోల్‌కతాకు బయలుదేరుతుంది.


కోణార్క రథాలయం
రథం ఆకారంలో ఉన్న ఈ సూర్యదేవాలయం ఒక ఖగోళ విజ్ఞాన భండారం. క్రీ.శ 13వ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ కౌశలం దాడుల్లో ధ్వంసమైపోగా మిగిలిన ఉన్న ఆనవాళ్లలో నాటి శిల్పుల నైపుణ్యాన్ని వెతుక్కుంటూ ఆనందించడమే మిగిలింది. యునెస్కో ఈ ఆలయాన్ని హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ప్రస్తుతం ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహణలో మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సూర్యదేవాలయం ఒడిశా, పూరీ జిల్లాలో ఉంది కోణార్క్‌ లో ఉంది.  ఈ ప్రాంగణంలోని ఛాయాదేవి ఆలయం కూడా అద్భుతమైన నిర్మాణమే. ధ్వంసమై΄ోయిన వైష్ణవాలయం శిథిలాలను దగ్గరగా వెళ్లి చూస్తే నాటి ఇటుకల సైజు, వాస్తుశైలి అర్థమవుతాయి. ఇక్కడ ప్రదర్శించే లేజర్‌ షోలో ధ్వంసమైన ఆలయాల పూర్తి రూపాన్ని చూడవచ్చు. 

 5వ రోజు : ఉదయం రైలు కోల్‌కతాకు చేరుతుంది. రైలు దిగి గంగాసాగర్‌కు ప్రయాణం. కపిలముని ఆశ్రమం పర్యటన తర్వాత రాత్రి బస గంగాసాగర్‌లో.

గంగ భూమ్మీదకొచ్చింది
పురాణాల్లో కపిలముని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గంగ భూమ్మీదకు రావడానికి కారణభూతులు కపిలముని. స్థానిక కథనాల ప్రకారం ఆ కపిలముని ఆశ్రమమే ఇది. స్థానిక రాజు సాగరుడు అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి దానిని కపిలముని ఆశ్రమ ప్రాంగణంలో కట్టి వేసి తాను దాక్కున్నాడు. అశ్వం కోసం రాజు తన అరవైవేల మంది కొడుకులను పంపించాడు. వారు అశ్వాన్ని వెదకుతూ వచ్చి కపిలముని ఆశ్రమంలో గుర్తించారు. కపిలముని అశ్వాన్ని దొంగలించాడని ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన కపిలముని వారిని తన తపశ్శక్తితో భస్మం చేశాడు. వారి ఆత్మలు నరకంలో కొట్టుమిట్టాడుతున్నాయని, వారిని స్వర్గానికి పంపించాలంటే ఎలా అని మునిని అడిగినప్పుడు... గంగ దివి నుంచి భువికి దిగి వచ్చి చితాభస్మాలను తడుపుతూ ప్రవహించినప్పుడు వారికి శాపవిమోచనం జరుగుతుందని చెప్పాడు. సాగరుడి వంశంలో తరువాతి తరాలకు చెందిన భగీరథుడు ఆ పనికి పూనుకున్నాడు. భగీరథుడి ప్రయత్నంతో గంగ నేలకు దిగి వచ్చిన ప్రదేశమే ఈ గంగాసాగర్‌. గంగ భూమ్మీదకు వచ్చిన రోజు మకర సంక్రాంతి. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు ఇక్కడ గంగామాతకు విశేష పూజలు చేస్తారు. కపిల ముని ఆశ్రమం వెస్ట్‌బెంగాల్, సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లా, గంగాసాగర్‌ గ్రామంలో ఉంది. 

 6వ రోజు : గంగాసాగర్‌ నుంచి కోల్‌కతాకు రావడం. కాలీమాత ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు జసిదిహ్‌ వైపు సాగిపోతుంది.

కాళిక శక్తిపీఠం
కాళీమాత ఆలయం కలకత్తా కాళిగా దేశమంతటికీ ప్రసిద్ధి. ఇది 51 శక్తిపీఠాల్లో ప్రత్యేకమైన శక్తిపీఠం. వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉంది. ఈ ఆలయం ఆదిగంగానది తీరాన ఉంది. ఆది గంగా నది అంటే గంగోత్రిలో ఉద్భవించిన గంగానది కాదు. ఇది హుగ్లీ నది మూల స్థానం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం రెండు వందల యేళ్ల కిందట నిర్మించినది. కాళీమాత మొదట గుడిసె వంటి చిన్న కప్పుతో కూడిన నిర్మాణం ఉండేది. కాళీ మాత విగ్రహం మనిషి ఆకారంలో ఉండదు. ఒక రాతికి మూడు విశాలమైన బంగారు కళ్లు,  పొడవైన నాలుక, నాలుగు చేతులు ఉంటాయి. కాళీమాత ఆకారం ఇలా ఉండడానికి కారణంగా ఒక కథనం చెబుతారు. శివుడు తాండవం చేసి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని పయనిస్తున్న సమయంలో ఆమె కుడికాలి బొటనవేలు దేహాన్ని వీడి కింద పడి΄ోయిందని, ఆ వేలు పడిన ప్రదేశం ఇదని చెబుతారు. అందుకే కాళికామాత విగ్రహం మనిషి రూపంలో ఉండదు, బొటనవేలి ఆకారంలోనే ఉంటుంది. ఈ ఆలయ వీక్షణానికి కేవలం దర్శనం చేసుకుని వచ్చే సమయాన్ని మాత్రమే కేటాయించుకుంటే సరి΄ోదు. కాళికా మాత ఆలయం లోపల నట్‌ మందిర్, జోర్‌ బంగ్లా, సోస్థి తాలా, హర్‌కాత్‌ తాలా, రాధాకృష్ణ ఆలయం, నకులేశ్వర్‌ మహాదేవ్‌ఆలయం, కాకు కుండ్‌లు ఉంటాయి. ప్రశాంతంగా దర్శనం చేసుకుని, ఆధ్యాత్మికతను ఆస్వాదించాలంటే మూడు గంటల సమయం పడుతుంది.

7వ రోజు: తెల్లవారు జాముకు రైలు జసిదిహ్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ అవడం. ఆ తర్వాత వైద్యనాథ్‌ ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు వారణాసికి సాగిపోతుంది.

జార్ఖండ్‌ బైద్యనాథుడు
దక్షిణాది వాళ్లకు బైద్యనాథ ఆలయం అనగానే మహారాష్ట్ర, పర్లిలో ఉన్న బైద్యనాథ ఆలయమే గుర్తుకు వస్తుంది. ఇది జార్ఖండ్, సంతాల్‌ పరగణా, దియోఘర్‌లో ఉన్న బైద్యనాథ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. పురాణాల ప్రకారం రావణాసురుడు హిమాలయాల్లో శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాక΄ోవడంతో తన ఒక్కో తలనూ ఖండిస్తూ తొమ్మిది తలలను ఖండించుకున్నాడు. చివరికి పదవ తలను ఖండించబోతున్న క్షణంలో శివుడు ప్రత్యక్షమై వరమిస్తాడు. కోరిన కోరికలు తీర్చే కామ్న లింగాన్ని ప్రసాదిస్తే దానిని శ్రీలంకకు తీసుకెళ్తానని అడుగుతాడు రావణుడు. అలాగే శివుడు కామ్నలింగాన్నిస్తాడు. శ్రీలంక వెళ్లే వరకు మధ్యలో ఎక్కడా నేల మీద పెట్టకూడదనే నియమాన్ని కూడా చెబుతాడు. కామ్నలింగంతో బయలుదేరిన రావణాసురుడు జార్ఖండ్, దియోఘర్‌లో ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి సంద్యాక్రతువుల సమయమవుతుంది. ఒక గొర్రెల కాపరికి ఆ లింగాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు నేల మీద పెట్టవద్దని కోరుతాడు. అలాగేనని తీసుకున్న ఆ పశువుల కాపరి రావణాసురుడు రావడం ఆలస్యం కావడంతో ఆ శివలింగాన్ని నేల మీద పెట్టి వెళ్లి పోతాడు. భయంకరమైన వర్షం కారణంగా రావణాసురుడు తిరిగి రావడం ఆలస్యమైంది. ఆ అకాలవర్షానికి కారణం విష్ణువు మాయోపాయమేనని గ్రహిస్తాడు. ఆ లింగాన్ని పెకలించి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ సాధ్యం కాదు. ఇక చేసేదేమీ లేక వెళ్లిపోతాడు. ఆ కామ్నలింగం ఉన్న ప్రదేశం కావడంతో దీనికి జ్యోతిర్లింగ క్షేత్రమైంది. 

8వ రోజు ఉదయానికి వారణాసికి చేరుతుంది. విశ్వనాథుని దర్శనం తర్వాత రాత్రి బస వారణాసిలో. 
లయకారుని నిలయం
కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగ దర్శనం, గంగాహారతి వీక్షణంతోపాటు విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి అమ్మవార్ల ఆలయాలు, కాలభైరవ మందిరాలను కూడా దర్శించుకోవాలి. వీటన్నింటికీ ప్రత్యేకమైన ప్రాశస్త్య్రం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న విశ్వనాథుడి మందిరం కొత్తది. యూపీలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో ఈ ఆలయం అసలు పేరు ఆది విశ్వేశ్వరాలయం. భారత్‌ మీదకు దండెత్తి వచ్చిన మహమ్మద్‌ ఘోరీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అక్బర్‌ ఆస్థానంలో ఉన్న మొదటి మాన్‌సింగ్, తోడరమల్‌లు దీనిని పునర్నిర్మించారు. 17వ శతాబ్దం అంటే ఔరంగజేబు పాలన కాలంలో మరోసారి ఆటు΄ోట్లను ఎదుర్కొన్నదీ ఆలయం. హిందూ ఆలయాన్నింటినీ కూల్చేయమన్న ఆదేశం మేరకు జరిగిన విధ్వంసంలో ఇది ్ ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ ప్రాంగణంలో జ్ఞానవాపి మసీదు వెలిసింది. 18వ శతాబ్దంలో ఇందోర్‌ రాణి అహిల్యాబాయ్‌ హోల్కర్‌ పునర్నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న నిర్మాణం విశాలంగా అధునాతనంగా ఉంది. దీనిని 2021లో విస్తరించారు. లయకారుని ఆలయం ఇన్ని దఫాలుగా లయమైపోతూ తిరిగి ఆలయంగా మారుతూ వచ్చింది.

 9 వరోజు : ఉదయం రైలు అయోధ్యవైపు సాగుతుంది. అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌ గరితోపాలు ఇతర ఆలయాల దర్శనం. సరయు నదిలో హారతి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలైనట్లే.

రామ్‌లల్లా 
ఏడాదిన్నరగా దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆలయం రామ్‌లల్లా ఆలయం. అదే అయోధ్య రామమందిరం. రోజుకు లక్ష మంది దర్శించుకుంటున్నారు. ఆ సంఖ్య పర్వదినాల్లో ఒకటిన్నర లక్షకు చేరుతోంది. బాబర్‌ కాలంలో మసీదు రూపం సంతరించుకుని, బ్రిటిష్‌ పాలనకాలం తర్వాత స్వతంత్ర భారతంలో ప్రతీకాత్మకంగా రాముడు, సీత విగ్రహాలను ప్రతిష్ఠించుకుని, ముప్పై మూడేళ్ల కిందట విధ్వంసానికి గురయ్యి న్యాయస్థానం తీర్పుతో తిరిగి రూపుదిద్దుకున్న ఆలయం ఇది. ఇందులో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం ఆకట్టుకుంటుంది. దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డగా భావించేటట్లు ఉంటుంది రాముడి రూపం. కళ్లు మూసుకుని మొక్కుకోవడమే కాకుండా కళ్లారా చూడాల్సిన రూపం. ఆలయ నిర్మాణం కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత హనుమాన్‌ ఘరి దర్శనం, సరయు తీర విహారం ఆహ్లాదకరంగా సాగుతాయి.

10వ రోజు : ఉదయానికి భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ లక్నోకు చేరుతుంది. అదే రోజు అంటే 22వ తేదీన కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయ్, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్‌కు చేరడంతో పర్యటన పూర్తవుతుంది.

ఐఆర్‌సీటీసీ నిర్వహించే భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో ‘పూరీ కోల్‌కతా గంగాసాగర్‌ యాత్ర (ఎన్‌జెడ్‌బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్‌ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్‌కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్‌కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు.  టికెట్‌ ధరలు కంఫర్ట్‌ కేటగిరీ (సెకండ్‌ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్‌ కేటగిరీ (థర్డ్‌ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్‌ (స్లీపర్‌) లో ఒక్కొక్కరికి దాదాపు  19 వేల రూపాయలవుతాయి. 

గమనిక: లక్నో, కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయి, గ్వాలియర్‌ స్టేషన్‌ల మీదుగా పర్యటన సాగుతుంది. ఇక్కడి పర్యాటక ప్రదేశాల సందర్శన ఈ ప్యాకేజ్‌లో లేదు. ఈ టూర్‌లో బుక్‌ చేసుకున్న పర్యాటకులు ఆగ్రా స్టేషన్‌కు వెళ్లాల్సిన తప్పనిసరేమీ ఉండదు. పై స్టేషన్‌లలో ఎక్కడైనా రైలెక్కవచ్చు, దిగవచ్చు. 


ఐఆర్‌సీటీసీ నిర్వహించే భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో ‘పూరీ కోల్‌కతా గంగాసాగర్‌ యాత్ర (ఎన్‌జెడ్‌బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్‌ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్‌కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్‌కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు.  టికెట్‌ ధరలు కంఫర్ట్‌ కేటగిరీ (సెకండ్‌ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్‌ కేటగిరీ (థర్డ్‌ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్‌ (స్లీపర్‌) లో ఒక్కొక్కరికి దాదాపు 19 వేల రూపాయలవుతాయి. ఈ ట్రిప్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి మొదలవుతుంది.  ప్యాకేజ్‌కోడ్‌ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=NZBG62& 

– వాకా మంజులారెడ్డి,
సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement