అచ్చం మంత్రం వేసినట్లే... మంత్రముగ్ధులను చేస్తుంది!! | Meghalaya Shillong Cherrapunji Tour In December Full Details: Exploring Natural Wonders, Cultural Heritage And Spiritual Sites | Sakshi
Sakshi News home page

Meghalaya Tour Details: అచ్చం మంత్రం వేసినట్లే... మంత్రముగ్ధులను చేస్తుంది!!

Oct 20 2025 3:17 PM | Updated on Oct 20 2025 4:28 PM

Meghalaya Shillong Cherrapunjee tour in december details inside

డిసెంబర్‌ నెలలో మేఘాలయ విహారం. షిల్లాంగ్‌లో సేదదీరి...చిరపుంజి జల్లును చూద్దాం.మంజీరవ సవ్వడి చేసే జలపాతాన్ని వీక్షిద్దాం. భారత్‌ –బంగ్లా మధ్య వంతెన మీద అడుగులేద్దాం.స్వచ్ఛగ్రామంలో శుభ్రత పాఠం నేర్చుకుందాం. ముక్కు మీద కొమ్ముతో భయపెట్టే ఖడ్గమృగాన్ని చూద్దాం.కామాఖ్యను దర్శించుకుని బ్రహ్మపుత్రలో విహరిద్దాం.అసోమ్‌ కళల సంస్కృతిని మ్యూజియంలో చూద్దాం.నో డౌట్‌... మంత్రముగ్ధులను చేసే పర్యటన ఇది.అచ్చం మంత్రం వేసినట్లే...  మంత్రముగ్ధులను చేస్తుంది!! 

హైదరాబాద్‌ నుంచి గువాహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణం. గువాహటి ఎయిర్‌΄ోర్ట్‌లో టూర్‌ నిర్వహకులు రిసీవ్‌ చేసుకుని రోడ్డు మార్గాన ప్రయాణం షిల్లాంగ్‌కు సాగుతుంది. షిల్లాంగ్‌లో హోటల్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి బస.షిల్లాంగ్‌ నుంచి చిరపుంజికి ప్రయాణం. షిల్లాంగ్‌లో హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత చిరపుంజికి చేరుకుని ఎలిఫెంటా ఫాల్స్, నోహ్‌ కాకికాయ్‌ ఫాల్స్, మవాస్మాయ్‌ కేవ్స్‌ వీక్షణం తర్వాత తిరిగి షిల్లాంగ్‌కు ప్రయాణం. ఆ రాత్రి బస కూడా షిల్లాంగ్‌లోనే.

జల సోపానం
ఈ వాటర్‌ఫాల్స్‌ సుతిమెత్తగా మెట్లు దిగుతున్న అందమైన అమ్మాయిలాగ ఉంటుంది. పాద మంజీరాల సవ్వడి వలె చిరుసవ్వడి చేస్తూ జలధార మెట్ల మీద నుంచి ప్రవహించి నేల మీద మడుగుగా మారుతుంది. ఈ జలపాతాన్ని చూస్తే ఎలిఫెంట్‌ వాటర్‌ ఫాల్స్‌ అనే పేరు ఎందుకు వచ్చిందో వెంటనే అర్థం కాదు. ఏనుగంత భారీ జలపాతమూ కాదు, ఏనుగు తొండం వంటి ఆకారం నుంచి నీరు ప్రవహించడం వంటి ప్రకృతి సోయగమూ కనిపించదు. ఇక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండడంతో బ్రిటిష్‌ వాళ్లు ఎలిఫెంట్‌ ఫాల్స్‌ అన్నారు. అధికారిక డాక్యుమెంట్‌లలో అదే పేరు కొనసాగింది. స్థానిక ఖాసీ తెగ వాళ్లు తమ ఖాసీ భాషలో దీనికి పెట్టుకున్న పేరు ‘కా కై్షద్‌ లాయ్‌ పతెంగ్‌ ఖోసియో’. ఈ పేరు పలకడం సాధ్యం కాక΄ోవడం కూడా బ్రిటిష్‌ వారు పెట్టిన పేరే స్థిరపడి΄ోయింది.

మేఘాలయ బెళుం గుహలు 
మవాస్మాయ్‌ గుహలను ప్రకృతి అద్భుతం అంటే చాలా చిన్న మాట అవుతుంది. ఈ గుహలు ఓ పెద్ద రసాయన గ్రంథం. మన రాష్ట్రంలో బెళుం గుహల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా స్టాలగ్‌మైట్, స్టాలగ్‌టైట్‌ ధారలు కనువిందు చేస్తాయి. ఈ రసాయన ధారల గాఢతను బట్టి శాస్త్రవేత్తలు వాటి వయసును నిర్ధారిస్తారు. ఈ గుహల్లోపల నడుస్తుంటే ఒక గుహ నుంచి మరో గుహకు కనెక్షన్‌ ఉంటుంది. బౌద్ధ గుహల్లాగ ఎవరో పని గట్టుకుని తొలిచిన గుహలు కావివి. సహజంగా ఏర్పడిన గుహలు. ఇక చిరపుంజి గురించి దేశమంతటికీ తెలిసిన విషయం అత్యధిక వర్ష΄ాతం నమోదయ్యే ప్రదేశం అని. కానీ ఇక్కడ ఇంకా ఎన్నో ప్రకృతి చమత్కారాలున్నాయి. పర్వతాల మీదకు ట్రెకింగ్, అందమైన లోయల వీక్షణం, వ్యూ ΄ాయింట్‌లలో ఫొటో షూట్, వేళ్ల వంతెనలు కూడా. ఐదు వందల ఏళ్ల నాటి వేళ్ల వంతెన చిరపుంజికి మరో రికార్డ్‌.

సెవెన్‌ సిస్టర్‌ ఫాల్స్‌
నోహ్‌ కాకికాయ్‌ జల΄ాతానికి వ్యవహారనామం సెవెన్‌ సిస్టర్స్‌ వాటర్‌ఫాల్స్‌. ఇది కూడా బ్రిటిష్‌ అధికారులు చేసిన నామకరణమే. కెనడాలో మనటోబా గ్రామలోని ఏడుపాయల జలపాతం పేరు సెవెన్‌ సిస్టర్స్‌ హిల్స్‌. మేఘాలయలోని నోహ్‌ కాకికాయ్‌ జలపాతానికి కూడా సెవెన్‌ సిస్టర్స్‌ ఫాల్స్‌ అనే పేరు పెట్టడం ప్రభుత్వ రికార్డుల్లో రాయడంతో అది అధికారిక నామం అయింది. ఈ జలపాతం మవాస్మాయ్‌ గుహలకు దగ్గరలో ఉండడంతో స్థానికులు మవాస్మాయ్‌ జలపాతం అంటారు. ఇది ఎంత విశాలమైన జలపాతమంటే మొదటిపాయ నుంచి ఏడవ పాయ వరకు దూరం దాదాపు కిలోమీటరు ఉంటుంది. ఎండాకాలంలో సన్నని ధారలుగా ఉంటుంది. వర్షాకాలంలో ఝుమ్మని శబ్దం చేస్తూ ఉరకలెత్తుతున్న గోదావరిని తలపిస్తుంటుంది. ఈ జలపాతాన్ని దూరాన్నుంచి చూడడమే తప్ప జలధారల కింద సేదదీరే అవకాశం లేదు.ఈ రోజు ప్రయాణం షిల్లాంగ్‌ నుంచి డాకీకి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ప్రయాణం డాకీ లేక్‌కు సాగుతుంది. డాకీ లేక్‌ విహారం తర్వాత మాలిన్నాంగ్‌ విలేజ్‌ వీక్షణం. లివింగ్‌ రూట్స్‌ బ్రిడ్జి మీద నడక తర్వాత షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. ఈ రాత్రి బస కూడా షిల్లాంగ్‌లోనే.

దేశాలను కలిపే వంతెన
ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు... అని సినీగేయాలను ఆలపించాం. కానీ ఆ హద్దు ఈ హద్దు సరిహద్దుల మధ్య వంతెన గురించి ఏ పాటా లేదు. మనకు మనమే కపాడుకోవాలి. భారత్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య ఉమ్‌న్‌గోట్‌ నది ప్రవహిస్తుంటుంది. నది మీద మనదేశంలో డాకీ అనే గ్రామం నుంచి బంగ్లాదేశ్‌లోని తమాబిల్‌కు ఉన్న వంతెన పేరే డాకీ బ్రిడ్జి.

వక్కలూరు
మావ్‌ లిన్నాంగ్‌ గ్రామంలో వక్క పండిస్తారు. తమలపాకుతోపాటు తినే వక్క ఇక్కడ ప్రధాన పంట. గ్రామస్థులు పరిశుభ్రత పట్ల క్రమశిక్షణతో ఉంటారు. గ్రామంలో వీథులకు రెండు పక్కలా చెట్లు చక్కగా చిక్కగా విస్తరించి ఉంటాయి. కానీ రోడ్డు మీద ఒక్క ఆకు కూడా కనిపించదు. రాలిపడిన ఆకులను ఎత్తి డస్ట్‌బిన్‌లో వేయడం నుంచి అలా సేకరించిన చెత్తను ఎరువుగా మార్చడం వరకు ప్రతిదీ నియమబద్ధంగా చేస్తారు. డస్ట్‌ బిన్‌కి కూడా ప్లాస్టిక్‌ వాడరు, అన్నీ వెదురు బుట్టలే. అందుకే మావ్‌ లిన్నాంగ్‌ గ్రామం జీరో వేస్ట్‌ ΄ాలసీని అనుసరిస్తున్న అత్యంత శుభ్రమైన గ్రామంగా రికార్డు సాధించింది. ఈ గ్రామంలో మరో విశిష్టత ఏమిటంటే... ఇక్కడ మాతృస్వామ్యం కొనసాగుతోంది. తల్లి నుంచి ఆస్తి కూతుర్లకు సంక్రమిస్తుంది. అలాగే తల్లి ఇంటి పేరే పిల్లలకు సంక్రమిస్తుంది.

వేళ్ల వంతెన
చెట్ల వేరును వంతెనలా అల్లడం అన్నమాట. భూమిలోపల ఉండే వేళ్లతో ఎలా సాధ్యం అనే సందేహం నిజమే. కానీ రబ్బరు చెట్ల వేళ్లు భూమి లోపల విస్తరించడంతోపాటు కొన్ని వేళ్లు భూమి పైన కూడా ఉంటాయి. వాటిని చెట్టు నుంచి వేరు చేయకనే తాళ్లుగా పేనుతూ వంతెన అల్లుతారు. అల్లిక ఆధారం దొరకడంతో ఆ వేరు అదే దిశలో పెరుగుతూ ఉంటుంది. ఇలా నది మీద ఒక ఒడ్డున ఉన్న చెట్ల నుంచి మరో ఒడ్డున ఉన్న చెట్ల వేళ్లతో కలుపుతూ పూర్తిస్థాయి వంతెన రూపం తీసుకువస్తారు. ఆదివాసీలు తమ జీవనం కోసం ప్రకృతికి విఘాతం కలిగించరు. ఇంటి నిర్మాణానికి అవసరమైన కలపను కూడా ఎండిన చెట్ల నుంచే సేకరిస్తారు. చెట్ల నుంచి వేరును వేరు చేయకుండా వంతెన అల్లే కళ కూడా ప్రకృతి హితమైన జీవనం నుంచి పుట్టిన గొప్ప ఆలోచన అనే చె΄్పాలి. ఈ వంతెన మీద నడుస్తున్నప్పుడు లయబద్ధంగా చిన్న కదలికలు వస్తుంటాయి. స్థానికులు ఆ కదలికలకు అనుగుణంగా దేహాన్ని బాలెన్స్‌ చేసుకుంటూ ఏ మాత్రం తడబడకుండా నడుస్తారు. షిల్లాంగ్‌ నుంచి ఖజిరంగాకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత రోడ్డు మార్గాన ఖజిరంగా నేషనల్‌ పార్క్‌కు సాగిపపపోవాలి. ఇది దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల ప్రయాణం. ఖజిరంగాకు చేరిన తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావడం, రాత్రి బస.

ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి
మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌ హిల్‌స్టేషన్‌. ప్రకృతి వరమిచ్చినట్లున్న అందమైన పర్యాటక ప్రదేశం కూడా. ‘స్కాట్‌లాండ్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే ప్రశంసను  పొందిన నగరం. ఖాసీ, జాంతియా హిల్స్‌ చిక్కటి పచ్చదనాన్ని వీక్షిస్తూ సాగే ప్రయాణం గొప్ప అనుభూతి. పర్యటనలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సాగే ప్రయానానికి అర్థం గమ్యం కోసం ఎదురు చూడడం కాదు. అడుగడుగునా కనువిందు చేస్తున్న ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం. మేఘాలయ రాష్ట్రంలో మొదలైన ప్రయాణం అసోమ్‌కు చేరుతుంది. ఐదువేల అడుగుల ఎత్తులో సాగే ప్రయాణం భౌగోళిక శాస్త్రం పుస్తకాన్ని చదివినట్లే ఉంటుంది.ఖజిరంగ నుంచి గువాహటికి ప్రయాణం. తెల్లవారు జామున ఖజిరంగా నేషనల్‌ పార్క్‌ సఫారీకి బయలుదేరాలి. సఫారీ ఖర్చు ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు ఎవరికి వారే భరించాలి. నేషనల్‌పార్క్‌ సఫారీ తర్వాత తిరిగి హోటల్‌కు చేరి రిఫ్రెష్‌ అయి బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకుని గువాహటి వైపు సాగిపోవాలి. గువాహటిలో హోటల్‌ చెక్‌ ఇన్, రాత్రి బస.

కత్తిలాంటి అడవి
అసోమ్‌ అనగానే ఖడ్గమృగం కళ్ల ముందు మెదలుతుంది. ఖజిరంగా నేషనల్‌ పార్క్‌లో రెండువేలకు పైగా ఖడ్గమృగాలున్నాయంటే నమ్ముతారా? ఖడ్గమృగాలు మాత్రమే కాదు, పులుల సంఖ్య కూడా ఎక్కువే. వన్యప్రాణి సంరక్షణ చర్యలు పటిష్టంగా తీసుకోవడం వల్ల పక్షుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ ప్రకృతి వరాన్ని ఆస్వాదించాలంటే ఎలిఫెంట్‌ సఫారీ చేయాలి. ఎలిఫెంట్‌ సఫారీకి భయపడేవాళ్లు జీప్‌ సఫారీ చేయవచ్చు. ఖజిరంగా నేషనల్‌ పార్క్‌ సమగ్రత నేపథ్యంలో యునెస్కో ఈ అటవీ ప్రదేశాన్ని హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ తరవాత కామాఖ్య ఆలయ దర్శనం. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్‌ విహారం. క్రూయిజ్‌ టికెట్‌  ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులే టికెట్‌ కొనుక్కోవాలి. రాత్రి బస గువాహటిలో.

దశమహావిద్యల నిలయం
కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇందులో ప్రధాన దైవం కామాఖ్య అమ్మవారు. కామాఖ్య ఆలయం  ప్రాంగణంలో దశమహా విద్యల దేవతలు త్రిపుర సుందరి, మాతంగి, కమల, కాలి, తార, భువనేశ్వరి, బగలాముఖి, చిన్న మస్త, భైరవి, ధూమవతి కొలువై ఉన్నారు. ఇక్కడ శివుడు కామేశ్వరుడు, సిద్ధేశ్వరుడు, కేదారేశ్వర, ఆమరకోటేశ్వర, అగోర, కోటిలింగ పేర్లతో పూజలందుకుంటున్నాడు.

బ్రహ్మాండ ప్రయాణం
బ్రహ్మపుత్రలో పడవ ప్రయాణం లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. కొండవాలులో విస్తరించిన టీ తోటలను చూస్తూ క్రూయిజ్‌లో ప్రయాణించడం, క్రూయిజ్‌ ఆగిన చోట దిగి కాలినడకన వెళ్లి స్థానిక నివాస ప్రదేశాలను వీక్షించడం,  నడవలేని వాళ్లు రిక్షాలో ప్రయాణిస్తూ చుట్టి రావచ్చు. కాలిబాటల వెంట ఒకరి వెనుక ఒకరు మౌనంగా నడిచి వెళ్లే బౌద్ధ సన్యాసులు కనిపిస్తారు. బౌద్ధ చైత్యాలు, విహారాలు కనిపిస్తాయి. చిన్న పడవల్లో చేపలు పట్టే జాలరులు కనిపిస్తారు. ఈ టూర్‌లో రియల్‌ ఇండియాని దగ్గర నుంచి చూడవచ్చు. అందుకే ఇది బ్రహ్మాండమైన ప్రయాణం.గువాహటి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి లగేజ్‌తో బయలుదేరాలి. అస్సాం స్టేట్‌ మ్యూజియం వీక్షణం తర్వాత గువాహటి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేసి నిర్వహకులు వీడ్కోలు చెబుతారు. హైదరాబాద్‌ ఫ్లయిట్‌ ఎక్కి రాత్రికి హైదరాబాద్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది.

అసోం కళల నిలయం


అస్సాం స్టేట్‌ మ్యూజియాన్ని ‘అస్సాం రీసెర్చ్‌ సొసైటీ’ స్థాపించింది. మ్యూజియంలో ప్రతి ఎగ్జిబిట్‌ ఈ విషయాన్ని చెబుతూ ఉంటుంది. ప్రాచీన కాలం నాటి ఆయుధాల విభాగం అసోం జానపద జీవనశైలికి, నాటి లోహశాస్త్ర నైపుణ్యానికి అద్దం పడుతుంది. శిల్ప శాస్త్రం కూడా బాగా అభివృద్ధి చెందిన రోజులవి. రాతి శిల్పాలు, లోహ శిల్పాలతోపాటు దారుశిల్పాలు, మట్టి శిల్పాలను కూడా చూడవచ్చు.  పౌరాణిక కథనాల ప్రతిరూపాలవి. అసోం కళలు, సంస్కృతి అవగతమవుతుంది. సాహిత్య విభాగం ఇక్కడ చక్కటి సాహిత్యం వెల్లివిరిసిందనడానికి ప్రతిబింబంగా ఉంటుంది.

ఈ టూర్‌  ప్యాకేజ్‌ పేరు ‘మెస్మరైజింగ్‌ మేఘాలయ అండ్‌ అస్సాం ప్యాకేజ్‌ కోడ్‌: ఎస్‌హెచ్‌ఏ 14.  హైదరాబాద్‌ నుంచి మొదలై హైదరాబాద్‌ చేరడంతో పూర్తవుతుంది. ఏడు రోజులు సాగే ఈ టూర్‌లో షిల్లాంగ్, చిరపుంజి, ఖజిరంగా, గువాహటి ప్రదేశాలు కవర్‌ అవుతాయి. 

ప్రయాణం ఎప్పుడు? 
 8.12.2025. డిసెంబర్‌ 8వ తేదీ తెల్లవారు జామున 05.40 గంటలకు 6ఈ 972 ఫ్లయిట్‌ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఉదయం 08.10 నిమిషాలకు గువాహటికి చేరుతుంది.
డిసెంబర్‌ 14వ తేదీ 6ఈ 187 ఫ్లయిట్‌ , రాత్రి 19.20 గంటలకు గువాహటి నుంచి బయలుదేరి 22.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.

టారిఫ్‌ ఇలా ఉంటుంది!
సింగిల్‌ ఆక్యుపెన్సీలో 61,100 రూపాయలు. 
డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 45 వేలు, 
ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో 43, 750 రూపాయలు.

బుకింగ్‌ కోసం: 
ఐఆర్‌సీటీసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్,9–1–129/1/302, 
మూడవ ఫ్లోర్, ఆక్స్‌ఫర్డ్‌ ప్లాజా,ఎస్‌.డి. రోడ్, సికింద్రాబాద్, 
తెలంగాణ. ఫోన్‌ నంబరు: 8287932229 

– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement