breaking news
Cherrapunjee
-
చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి. -
ప్రకృతి కట్టిన వంతెనలు
చిరపుంజి కింద నదీ ప్రవాహం.. పైన ప్రకృతి నిర్మిత వంతెనపై విహారం.. ఏడాది పొడవునా వానలు.. ఎత్తై జలపాతాలు.. పచ్చదనం పరుచుకున్న అడవులు.. దట్టంగా అలముకునే పొగమంచు.. వేడి అన్నదే లేని ఈ శీతల ప్రాంతం ఉన్నది మనదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి లో! ఉత్తర ఈశాన్య ప్రాంతమైన చిరపుంజిలో మావ్ లనోంగ్ గ్రామానికి వెళితే ప్రకృతి కట్టిన వంతెనలపై మీరూ అడుగులు వేయవచ్చు. భువిపై అత్యంత చిత్తడినేలగా పేరున్న చిరపుంజిలో రబ్బరు వృక్షాల నుంచి వచ్చిన వేర్లు ఇవి. ఒకదానికొకటి అల్లుకుపోయి, నదికి ఇటు వైపు నుంచి అటువైపుకు వంతెన కట్టాయి. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి, ట్రెకింగ్ చేయడానికి యువత ఆసక్తి చూపుతుంటారు. 100 అడుగుల పొడవులో, 50 మందిని మోయగల సామర్థ్యంతో ఉన్న ఈ బ్రిడ్జ్‌లు సుమారు ఐదారు వందల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటాయని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలా వెళ్ళాలి: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఎయిర్ పోర్ట్ ఉంది. గౌహతీకి రైలుమార్గం ఉంది. అక్కడి నుంచి చిరంపుంజికి 99 కి.మీ. గౌహతి రైల్వేస్టేషన్‌కు దగ్గరలో పల్టాన్ బజార్లో బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి షిల్లాంగ్‌కి, షిల్లాంగ్ నుంచి చిరపుంజికి బస్ సదుపాయాలు ఉన్నాయి. సందర్శనకు మే నెల వరకు అనుకూలం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా పడతాయి వేసవి ఉష్ణోగ్రత 13 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.