దుబాయ్‌ పర్యాటక శోభ..! | IRCTC Introduces Dubai Abu Dhabi Package In Rs 1 Lakh, A 5-Day Tour Of Iconic Landmarks And Desert Adventures | Sakshi
Sakshi News home page

IRCTC Abu Dhabi Package: దుబాయ్‌ పర్యాటక శోభ..!

Oct 27 2025 9:46 AM | Updated on Oct 27 2025 11:58 AM

IRCTC introduces DubaiAbu Dhabi package making Just Rs 1 Lakh

ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం బుర్జ్‌ ఖలీఫా. టాలెస్ట్‌ అబ్జర్వేషన్‌ వీల్స్‌ ఎయిన్‌ దుబాయ్‌. గోల్డెన్‌ టూరిజమ్‌ స్పాట్‌ మిరకిల్‌ గార్డెన్‌. ప్రపంచదేశాల కలబోత గ్లోబల్‌ విలేజ్‌. దుబాయ్‌ నిర్మాణ కీర్తికిరీటం బుర్జ్‌ ఖలీఫా. హిందూ పౌరాణిక శిల్పగ్రంథం బాప్స్‌ మందిరం. ద్వైపాక్షిక స్నేహబాంధవి షేక్‌ జాయేద్‌ మసీదు. ఇదీ మా దేశం... అని చూపించే దుబాయ్‌ ఫ్రేమ్‌. ఆహ్లాదకర సాయంత్రానికి థో క్రూయిజ్‌ విహారం. సాంస్కృతిక వేడుకల మధ్య ఎడారి అన్వేషణం. దుబాయ్‌ టూర్‌లో శోభాయమాన సొగసులివి.

1వరోజు
ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో టూర్‌ నిర్వహకులకు రి΄ోర్ట్‌ చేయాలి. విమానం పది గంలకు బయలుదేరి 12.25కి దుబాయ్‌కి చేరుతుంది. ఎయిర్‌΄ోర్ట్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుని లగేజ్‌ కలెక్ట్‌ చేసుకున్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిట్‌ గేట్‌ దగ్గర టూర్‌ నిర్వహకులు (దుబాయ్‌ టీమ్‌) రిసీవ్‌ చేసుకుని లంచ్, ఆ తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు తీసుకువెళ్తారు. హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ అయ్యి కొద్ది సేపు విశ్రాంతి. సాయంత్రం ధో క్రూయిజ్‌లో విహారం, రాత్రి డిన్నర్‌ క్రూయిజ్‌లోనే. క్రూయిజ్‌ విహారం తర్వాత హోటల్‌ గదికి చేరుస్తారు.

క్రూయిజ్‌ విహారం
పర్షియన్‌ గల్ఫ్‌లో క్రూయిజ్‌ విహారం దుబాయ్‌ టూర్‌లో నెక్ట్స్‌ లెవెల్‌ అని చెప్పవచ్చు. దుబాయ్‌లో విస్తరించిన ఆకాశహర్మ్యాలను ఆసాంతం వీక్షించాలంటే దుబాయ్‌ వీథుల్లో ఎంత తిరిగినా పూర్తిగా చూడలేం. క్రూయిజ్‌లో నీటి మీద నుంచి నేలను చూడాలి. నింగి–నేలను తాకుతున్నట్లున్న నిర్మాణాలు కనువిందు చేస్తాయి. ఎయిర్‌ కండిషన్డ్‌ క్రూయిజ్‌లో దాదాపు మూడు గంటల పాటు సాగే విహారంలో బఫే భోజనం, డాన్స్‌ షోలను ఆస్వాదించడం గొప్ప అనుభూతి. డిన్నర్‌లో కాంటినెంటల్, అరబిక్‌ వంటకాలు నోరూరిస్తాయి. 

మాంసాహారంతోపాటు శాకాహార వంటకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. సాఫ్ట్‌ డ్రింక్స్‌ కూడా ఉంటాయి. దుబాయ్‌లో క్రూయిజ్‌ విహారానికి నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం అనువుగా ఉంటుంది. అందమైన సాయంత్రాలు, ఫ్రెండ్స్‌తో గెట్‌ టు గెదర్‌లకు ధరించినట్లు క్రూయిజ్‌ విహారానికి ఆహ్లాదకరమైన దుస్తులు ధరించాలి. లైట్‌ కలర్, ఫ్లోరల్‌ డిజైన్‌లయితే స్కై స్క్రాపర్స్, డాన్స్‌ షో బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు అందంగా వస్తాయి. 

2వరోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత దుబాయ్‌ సిటీ టూర్‌. ఎయిన్‌ దుబాయ్‌ (వరల్డ్స్‌ టాలెస్ట్‌ అబ్జర్వేషన్‌ వీల్స్‌ అడ్మిషన్‌) వీక్షణం. ఇండియన్‌ రెస్టారెంట్‌లో భోజనం. ఆ తర్వాత డెసర్ట్‌ సఫారీకి ప్రయాణం. డెజర్ట్‌ సఫారీలోనే రాత్రి భోజనం చేసి రాత్రి బసకు హోటల్‌కు చేరాలి.

జెయింట్‌కే జెయింట్‌
ఎయిన్‌ దుబాయ్‌ కొత్త టూరిస్ట్‌ అట్రాక్షన్‌. ప్రపంచంలో అత్యంత పెద్ద అబ్జర్వేషన్‌ వీల్‌ అది. సాధారణ భాషలో చె΄్పాలంటే జెయింట్‌ వీల్‌లకే జెయింట్‌ వీల్‌. కరోనాకు ముందు దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన వాళ్లు దీనిని చూసి ఉండరు. నాలుగేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకుంది. 850 అడుగుల ఎత్తున్న ఈ వీల్‌లో ఒకసారి 1,750 మంది కూర్చుని ఆకాశ విహారం చేయవచ్చు.

ఎడారిలో పాదముద్రలు
ఓ గంటపాటు వాహనంలో విహారం, ఆ తర్వాత ఒంటె మీద విహారం, క్యాంప్‌ గుడారాల్లో విశ్రాంతి, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల వీక్షణం, బఫే భోజనాన్ని ఆస్వాదించడం లైఫ్‌టైమ్‌ మెమొరీ అనే చెప్పాలి. ఎడారిలో విహారం అనగానే వడగాలి వస్తుందని భయపడతాం. 

కానీ నవంబర్‌ నుంచి సాయంత్రాలు ఇసుక తిన్నెల మీద నుంచి చల్లని పిల్లగాలులు వీస్తూ విహారం ఆహ్లాదకరంగా సాగుతుంది. పగలు గాలికి ఇసుక పైకి లేస్తూ ఒంటిని తాకి కొంత సేపటి తర్వాత చికాకు పెడుతుంది. కానీ చలికాలం సాయంత్రాలు ఇసుక కూడా బరువుగా నేల మీదే ఉంటుంది. ఇసుకలో పాదముద్రలను చూసుకుంటూ నడవాలనే సరదా కూడా తీరుతుంది. 

3వరోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత మిరకిల్‌ గార్డెన్‌లో విహారం, గ్లోబల్‌ విలేజ్‌  వీక్షణం. ఇండియన్‌ రెస్టారెంట్‌లో లంచ్‌ తర్వాత బుర్జ్‌ ఖలీఫా విజిట్‌. సాయంత్రం లైట్‌ షో, రాత్రి భోజనం తర్వాత రాత్రి బస కోసం తిరిగి హోటల్‌కు చేరడం.

ఎడారి పూదోట
దుబాయ్‌ మిరకిల్‌ గార్డెన్‌ నిజంగానే ఓ అద్భుతం. పైగా ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉద్యానవనం. దుబాయ్‌ వంటి ఎడారి దేశంలో రంగురంగుల పూలతో 72 వేల చదరపు మీటర్ల పూలతోట ఒక ఆశ్చర్యం. కోట్లాది మొక్కలు, పూలతో స్వర్గంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. ఈ గార్డెన్‌ 2015లో గోల్డెన్‌ టూరిజమ్‌ అవార్డు కూడా 
అందుకుంది.

దుబాయ్‌లో ఇండియా
దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్, పేరుకు తగ్గట్టే ప్రపంచదేశాలను ప్రతిబింబిస్తున్న గ్రామం. ఆఫ్గనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, లెబనాన్, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్‌ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్‌లాండ్, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, యెమెన్‌ దేశాల సంస్కృతి సంప్రదాయాలు కొలువుదీరాయి. సరాసరిన రోజుకు 40 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. 20 వేలకు పైగా వాహనాలను పార్కింగ్‌ చేయగలిగినంత పార్కింగ్‌లాట్‌ అది.

దుబాయ్‌ కీర్తిశిఖరం
దుబాయ్‌ కీర్తికిరీటంలో కలికితురాయి వంటిది బుర్జ్‌ ఖలీఫా. ఇది ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం కూడా. దీని ఎత్తు 2,722 అడుగులు. యాంటెన్నాతో కలుపుకుంటే దీని ఎత్తు 2,717 అడుగులు. ఇది 163 అంతస్థుల భవనం. ఈ భవనం మీద నుంచి పరిసరాలను వీక్షించడానికి వీలుగా 124, 125, 148వ అంతస్థుల్లో అబ్జర్వేషన్‌ డెక్‌లున్నాయి. 

ఇంకా పైకి వెళ్లి ప్రశాంతంగా సమయం గడుపుతూ వీక్షించడానికి 152, 153, 154 అంతస్థుల్లో విశాలమైన లాంజ్‌లున్నాయి. వీటికి వరల్డ్స్‌ హైయ్యస్ట్‌ లాంజ్‌లుగా రికార్డు కూడా ఉంది. ప్రపంచ పటంలో దుబాయ్‌కి గొప్ప స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జరిగిన నిర్మాణాలు దుబాయ్‌ ప్రపంచ రికార్డుల జాబితాను పెంచేశాయి. బుర్జ్‌ ఖలీఫాకి పాతికకు పైగా అవార్డులున్నాయి. 

4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత దుబాయ్‌ సిటీ టూర్‌. బీపీఏఎస్‌ టెంపుల్‌ దర్శనం. ఫెరారీలో ఫొటో షూట్‌. షేక్‌ జాయేద్‌ మాస్క్‌ వీక్షణం. ఇండియన్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌ తర్వాత హోటల్‌లో డ్రాప్‌ చేస్తారు.

దుబాయ్‌ హైందవం
శిల్పశాస్త్రం చెప్పిన నియమానుసారం నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 27 ఎకరాలను బహూకరించింది. ఇది 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు నిర్మాణం. స్థపతుల బృందం భారతదేశం నుంచి వెళ్లి నిర్మించింది. 

ఆలయంలో ప్రతి అంగుళమూ పౌరాణిక గ్రంథాల దృశ్యాలతో నిండి, శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంటుంది. కోణార్క్, రాణక్‌పూర్, దిల్‌వారా ఆలయాలు గుర్తు వస్తాయి. ఈ నిర్మాణం గత ఏడాది ‘బెస్ట్‌ కల్చరల్‌ ప్రాజెక్ట్‌‘ అవార్డు అందుకుంది.

పెద్ద మసీదు
షేక్‌ జాయేద్‌ మసీదు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని నగరం అబుదాబిలో ఉంది. ఇది 30 ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం, దేశంలోకే పెద్ద మసీదు. రోజూ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈ మసీదు పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, యూఏఈకి ఇతర దేశాలతో సుహృద్భావ సంబంధాలను కూడా ఏర్పరుస్తోంది. గతంలో బ్రిటన్‌ రాణి రెండవ ఎలిజబెత్, యూఎస్‌ నుంచి జో బైడెన్, మన ప్రధాని నరేంద్రమోదీలు ఈ మసీదును సందర్శించారు. 

5వరోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి బయలుదేరాలి. దుబాయ్‌ ఫ్రేమ్‌ సందర్శన, లంచ్, షాపింగ్‌ తర్వాత ఆరున్నరకు టూర్‌ నిర్వహకులు పర్యాటకులను దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేస్తారు.

గవాక్ష వీక్షణం
దుబాయ్‌ ఫ్రేమ్‌ అనేది ఒక వ్యూ పాయింట్‌. మన కోటలను సందర్శించినప్పుడు అంతఃపుర స్త్రీలు నగరాన్ని చూడడం కోసం, నగరంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడం కోసం రాజమందిరాల్లో ఏర్పాటు చేసిన గవాక్షాలను చూస్తుంటాం. ఆ కిటికీ వ్యూ నగరమంతా కనిపించేటట్లు ఉంటుంది. దాదాపుగా అలాంటిదే ఇది కూడా. ఇక్కడి నుంచి చూస్తే దుబాయ్‌ సిగ్నేచర్‌ వ్యూ కనిపిస్తుంది. 

ఈ చట్రం నుంచి చూస్తే దుబాయ్‌లోని ఆకాశహర్మ్యాలన్నీ ఒక చోటకు చేర్చి దండకట్టినట్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఫొటో తీసుకుంటే దుబాయ్‌ అంతటినీ బ్యాక్‌డ్రాప్‌లో ఇముడ్చుకున్నట్లు ఉంటుంది. ప్రపంచంలో అది పెద్ద ఫ్రేమ్‌గా రికార్డు కూడా తన టూరిజమ్‌ ఖాతాలో జమ చేసుకుంది దుబాయ్‌. ‘ద స్లె్పండర్స్‌ ఆఫ్‌ దుబాయ్‌’ టూర్‌ తర్వాత ఈ ఫొటోలతో ఆల్బమ్‌ చేసుకుంటే... దుబాయ్‌ పర్యటనలో మధురానుభూతులను కూడా ఒక ఫ్రేమ్‌లో బంధించుకున్నవారవుతాం. 

ప్యాకేజ్‌లో ఏమేమి వర్తిస్తాయి?
హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి ΄ోను రాను విమాన టికెట్‌లు. త్రీ స్టార్‌ హోటల్‌ బస, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్, ఐదు రోజులు లంచ్, నాలుగు రోజులు డిన్నర్‌. టూర్‌లో ఉదహరించిన సైట్‌సీయింగ్‌కి రవాణా, ఎంట్రీ టికెట్‌లు, లోకల్‌ టూర్‌ గైడ్‌ సౌకర్యం,  మిరకిల్‌ గార్డెన్, గ్లోబల్‌ విలేజ్, హాఫ్‌ డే దుబాయ్‌ సిటీ టూర్, అనీ దుబాయ్‌ దుబాయ్, గ్రాండ్‌ మాస్క్, బుర్జ్‌ ఖలీఫా, దుబాయ్‌ ఫేమ్‌ వీక్షణం. క్రూయిజ్‌ జర్నీ, ఎనభై ఏళ్ల లోపు వారికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్, దుబాయ్‌కి వీసా చార్జీలు, ఐదు శాతం టీసీఎస్‌.

ఏమేమి వర్తించవు?
ఎయిర్‌పోర్ట్‌లో చెల్లించాల్సి వచ్చిన అదనపు చార్జీలు (ఎక్స్‌ ట్రా లగేజ్‌ చార్జ్‌ వంటివి). డ్రైవర్, గైడ్‌లకు టిప్పులు, లాండ్రీ, మెనూలో లేని మద్యం వంటి ఇతర పానీయాలు. 

ఏయే డాక్యుమెంట్‌లు ఉండాలి!
పాస్‌పోర్ట్‌ ఒరిజినల్‌. పాన్‌ కార్డ్‌. ఫొటో సాఫ్ట్‌కాపీ వైట్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండాలి.

బుకింగ్‌ కోసం సంప్రదించాల్సిన చిరునామా:
జోనల్‌ ఆఫీస్, ఐఆర్‌సీటీసీ, 
9–1–129/1/302, థర్డ్‌ ఫ్లోర్, ఆక్స్‌ఫోర్డ్‌ప్లాజా, ఎస్‌డీ రోడ్, 
సికింద్రాబాద్, తెలంగాణ. ఫోన్‌ నంబరు: 040–27702407.

ఐఆర్‌సీటీసీ, నియర్‌ రైల్వె రిటైరింగ్‌ రూమ్స్, 
అప్‌ స్టైర్స్, స్టేషన్‌ బిల్డింగ్, విజయవాడ. 
ఫోన్‌ నంబరు: 92810–30714

ఇది దుబాయ్‌ టూర్‌!
ఐఆర్‌సీటీసీ దుబాయ్‌ పర్యటన కోసం డిజైన్‌ చేసిన ΄్యాకేజ్‌ పేరు ‘ద స్లె్పండర్స్‌ ఆఫ్‌ దుబాయ్‌’. ప్యాకేజ్‌ కోడ్‌ ఎస్‌హెచ్‌ఓ3. నవంబర్‌ 8వ తేదీన మొదలయ్యే ఈ ఐదు రోజుల టూర్‌లో దుబాయ్, అబూదాబీ కవర్‌ అవుతాయి.

టికెట్‌ ధరలిలా:
సింగిల్‌ ఆక్యుపెన్సీలో రూపాయలు 1,34, 950. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1,13, 400. ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1, 12, 250 రూపాయలు.

ప్రయాణం ఎప్పుడు?

8–11–2025 ఉదయం పది గంటలకు ‘ఈకే–527’ విమానం హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. దుబాయ్‌కి 12.25 గంటలకు చేరుతుంది.

12– 11– 2025 రాత్రి తొమ్మిదిన్నరకు దుబాయ్‌లో ‘ఈకే– 524’ విమానం బయలుదేరుతుంది.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement