
ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలిగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉన్నది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయ ద్వారం పట్టనంత. స్థల పురాణం ప్రకారం ఆ కథ ఇలా ఉంది...
శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్నకు వివాహమై ఎంతో కాలం గడిచినా సంతానం లేదు. దాంతో సంతానం కోసం స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు.
కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకవెళ్లలేక పోయాడు.
దీంతో ఆ గోలేన్ని ఆలయ ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఎంతో దుఃఖిస్తూ గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా అక్కడే వదిలి ఇంటికి వెల్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు.
న్యాయమైన కోర్కెలు తీర్చే నాగాభరణుడు
ఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలేం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్ది కాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం.
కార్తీక మాసం ప్రత్యేక పూజలు
మన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల వారికి కార్తీక మాసంలో ఎక్కువగా దైవచింతన, గుడులు, తీర్ధయాత్రలు చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగంలో ఈ నెల రోజులపాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ మాసంలో శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుని మొక్కులు మొక్కుకుని వెళుతుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు విచ్చేస్తుంటారు.
– సుంకరి శాంత భాస్కర్,
సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా
(చదవండి: సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ)