సాక్షి, శ్రీకాకుళం: అక్కడ ప్రతి 100 మందిలో కనీసం 18 మందికి కిడ్నీ వ్యాదులతో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగడుగునా కనిపిస్తారు. ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా వారి కిడ్నీ బాధలు గురించే చెబుతారు.
ఉద్ధానం అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిలయంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ప్రతి నూటి మందిలో 18 మందికి కిడ్నీ వ్యాధులు ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. దాంతో ఆ ప్రాంతంలో పుట్టడమే తాము చేసిన నేరమా అంటూ అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా కిడ్నీ వ్యాదులు వ్యాపిస్తున్నాయి. అసలు ఆ వ్యాధి రావడానికి గల కారణాలను పరిశోధించడానికి వెద్య నిపుణులు సిద్ధమయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు ప్రాంతాలలో తమ పరిశోధనలు జరుగుతున్నాయని వెద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు రూ.6.01 కోట్లతో అనుమతి ఇచ్చిందన్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనేందుకు తొలి విడతలో 5,500 మంది నుంచి నమూనాలు సేకరిస్తామని తెలిపారు. ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామన్నారు.
ఉద్దానంలోని వేర్వేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరిచేను, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


