
నిజాం కాలంలో వాడిన వస్తువులు, ఛాయా చిత్రాలు
ఆకట్టుకుంటున్న షాండిలియర్స్, పాలరాతి శిల్పం
8వ నిజాం ముకర్రం ఝా ఎగ్జిబిషన్ సందర్భంగా చౌమహల్లా ప్యాలెస్‌పై ప్రత్యేక కథనం
చార్మినార్: ఆసఫ్ జాహీల రాచరిక పాలనకు అద్దంపట్టే విధంగా ఉన్న పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌లో 8వ ఆసఫ్ ఝా, మాజీ హైదరాబాద్ నిజాం ముకర్రం ఝా బహదూర్ జయంతిని పురస్కరించుకుని అరుదైన ఛాయా చిత్రాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 6న ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన కుమారుడైన 9వ నిజాం అజ్మత్ ఝా బహదూర్ ప్రారంభించగా..7న నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు చౌమహల్లా ప్యాలెస్ భవనం, అందులోని నిజాం కాలం నాటి వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం..
చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌదం. ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్‌ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది.
నిజాం ప్రభువుల నివాస గృహంగా..
ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు.
మ్యూజియంలో చూడదగ్గవి..
ఈ ఛాయా చిత్ర ప్రదర్శనతో పాటు నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది.
ఎక్కడ: యూరోపియన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్‌లో ఉంది.
ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్‌బజార్, ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే చౌమహల్లా ప్యాలెస్ భవనం
కనిపిస్తుంది.
ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!