
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమానే ఒక యానిమేషన్ సినిమా వెనక్కు నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్లో వచ్చిన 'మహావతార్ నరసింహా' చిత్రం తెలుగులో దుమ్మురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం ట్రెండ్ కనిపిస్తోంది. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జులై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
'మహావతార్ నరసింహా' చిత్రం మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో కలిపి రూ. 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 22 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 31 కోట్లగా ఉండవచ్చని అంచనా.. అయితే, తెలుగులో 4రోజులకు గాను రూ. 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏకంగా వీరమల్లు చిత్రాన్ని తొలగించి 'మహావతార్ నరసింహా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా ఉంది. అల్లు అరవింద్ గతంలో కూడా కాంతార, 2018 వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు ‘మహావతార నరసింహ’తో ఆయన జాక్‌పాట్ కొట్టారని నెటిజన్లు చెబుతున్నారు.