
పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఏమీ చేయొద్దని వేడుకున్నా కనికరించని రాక్షసుడు
బాలిక పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు.
ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్‌ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్‌ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.