
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్‌లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్‌తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు.
అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్‌ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్‌తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు.
డిజైనింగ్‌తో స్టోరీ టెల్లింగ్..
మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్‌లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు.
ప్రకృతి అందాలే ఈ డిజైన్‌లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్‌లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్‌లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.
(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!)