
అలసిన డ్రైవర్.. డొక్కు వాహనం
అయినా డ్యూటీ తప్పదన్న ఉన్నతాధికారులు
ఫలితంగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీల దుర్మరణం
అదనపు ఎస్పీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పోలీసు శాఖ తీరుపై బాధిత కుటుంబాల మండిపాటు
సాక్షి, అమరావతి : ‘సార్.. రాత్రి వరకు డ్యూటీ చేశాను. గంటల తరబడి కాన్వాయ్ వెహికిల్ డ్రైవింగ్ చేశాను. కనీసం రెస్ట్ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడే డ్రైవింగ్ విధులకు వెళ్లాలంటే కష్టం’ అని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ‘సీఎం టూర్.. డ్యూటీ చేయాల్సిందే’ అని ఆదేశించారు. పోనీ ఆ పోలీస్ వాహనం కండీషన్ సరిగా ఉందా అంటే అదీ లేదు. ఉన్నతాధికారుల ఆదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేశారు ఆ డ్రైవర్. ఫలితంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం.. డ్రైవర్‌తోపాటు ఓ అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలు.
పోలీసు శాఖలో తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం వెనుక అసలు కారణమిది. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నిర్వాకమే పోలీసు అధికారులను బలి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నందున నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ కోకా దుర్గా ప్రసాదరావు, డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశించారు. కానీ వారికి కేటాయించిన పోలీసు వాహనం సరైన కండిషన్‌లో లేదు. ఆ వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కొర్లవహడ్ టోల్ గేటు వద్దకు రాగానే మొరాయించింది.
పోలీసు అధికారులు ఆ విషయాన్ని హైదరాబాద్‌లోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. దాంతో హైదరాబాద్ నుంచి మరో స్కారి్పయో వాహనాన్ని పంపిస్తామని చెప్పారు. అందుకోసం డ్రైవర్ రెడ్డిచర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వాయ్ విధులు ముగించుకుని వచ్చారు. వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశాను.. బాగా అలసిపోయాను అని చెప్పారు. కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. సమకూర్చిన స్కార్పియో వాహనం అయినా సరిగా ఉందా అంటే ఆ వాహనం కండిషన్ కూడా బాగోలేదు.
డ్రైవర్ అలసిపోయినందునే ప్రమాదం
ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరై డ్రైవర్ నరసింహరాజు ఆ డొక్కు స్కార్పియోతో కొర్లవహడ్ వెళ్లారు. అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతోసహా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే గంటల తరబడి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయి ఉన్న నరసింహరాజు కళ్లు మూతలు పడుతున్నా అతి కష్టంగా డ్రైవింగ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు కైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్‌గా ఆగిన లారీని గుర్తించలేక పోయారు. చివరి నిముషంలో పక్కకు తప్పుకునే యత్నంలో స్కారి్పయో డివైడర్‌పైకి ఎక్కి పల్లిటిలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు పడింది.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ట్యాంకర్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అదనపు ఎస్పీ దుర్గా ప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నరసింహరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పోలీసు కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీక్లీ ఆఫ్‌లూ ఇవ్వకుండా, గంటల తరబడి డ్యూటీ చేసి అలసిపోయినా విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే చాలా.. పోలీసు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదా అని నిలదీస్తున్నారు.