మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ | Do you know about Attukal Pongala Sabarimala of Women In kerala | Sakshi
Sakshi News home page

మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ

Jul 27 2025 3:55 PM | Updated on Jul 27 2025 4:13 PM

Do you know about Attukal Pongala Sabarimala of Women In kerala

Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్‌ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్‌ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్‌ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.

ఆలయ చరిత్ర
ఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్‌ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్‌ భగవతి ఆలయం వెలుగు చూసింది.

ఆలయ నిర్మాణం
కేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.

అట్టుక్కల్‌ పొంగళ
ఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్‌ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్‌ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్‌ బుక్‌ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.

ఇదీ  చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంక్‌, మార్క్ షీట్ వైరల్‌

ఎలా చేరుకోవాలి?
తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
 

-చెన్నాప్రగడ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement