breaking news
Attukal Pongala
-
మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.ఆలయ చరిత్రఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్ భగవతి ఆలయం వెలుగు చూసింది.ఆలయ నిర్మాణంకేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.అట్టుక్కల్ పొంగళఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్ బుక్ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.ఇదీ చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్ఎలా చేరుకోవాలి?తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. -చెన్నాప్రగడ శర్మ -
అట్టుకల్... అంతా మహిళలే...
‘అట్టుకల్ పొంగల్’... గిన్నిస్ బుక్లో చోటు సాధించిన అరుదైన వేడుక. ఇందులో పాల్గొనే వారంతా మహిళలే. ఈ వేడుకలో పురుషులకు చోటు లేదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలంతా ఒకేచోట చేరి జరుపుకొనే ఈ వేడుక అట్టుకల్ భగవతీదేవి ఆలయంలో జరుగుతుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో సుప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టుకల్ భగవతీ ఆలయం అతి పురాతనమైనది. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత ఇక్కడ భగవతీదేవిగా వెలిసింది. స్థానికులు అమ్మవారిని ‘అట్టుకల్ అమ్మ’గా పిలుచుకుంటారు. ఆమెను భద్రకాళిగా భావించి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అద్భుత నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అట్టుకల్ ఆలయం గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. కేరళలోని కులీన కుటుంబాల్లో ఒకటిగా పేరుపొందిన ముల్లువీట్టిల్ కుటుంబ పెద్ద అమ్మవారికి పరమభక్తుడు. ఆయన ఒకనాడు కిళియార్ నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాలిక అక్కడకు వచ్చింది. తాను అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి ఉందని, తనను నది దాటించాలని ఆయనను కోరింది. బాలిక ముఖంలోని దివ్యతేజస్సుకు ముగ్ధుడైన ఆ పెద్దాయన ఆమెను నది అవతలి ఒడ్డుకు చేర్చడమే కాకుండా, అక్కడకు దగ్గర్లోనే ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆయన ఇంట్లోని వాళ్లు కూడా ఆమెను చూసి ముచ్చటపడ్డారు. ఆమెకు ఘనంగా అతిథి మర్యాదలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. వాళ్లు ఆ సన్నాహాల్లో ఉండగానే ఆమె అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. అదేరోజు రాత్రి కుటుంబ పెద్దకు అమ్మవారి రూపంలో కలలో కనిపించింది. పెద్దాయనకు చెందిన తోటలో కొలువుంటానని, తోటలో మూడు రేఖలు కనిపించే ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించాలని కోరింది. వేకువ జామునే మేలుకున్న పెద్దాయన తోటకు వెళ్లి, అమ్మవారు కలలో చెప్పిన చిహ్నాలు కనిపించిన చోట ఆలయ నిర్మాణం చేపట్టాడు. ఆ పెద్దాయన ఆహ్వానంపై బదరీనాథ్ ఆలయ ప్రధానార్చకుడు స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా ఇక్కడ దేవతా ప్రతిష్ఠాపన చేశారు. కణ్ణగి గాథ తమిళనాడులోని పుహార్ ప్రాంతం పాండ్య రాజుల ఏలుబడిలో ఉన్న కాలం అది. పుహార్ పట్టణంలో కోవలన్ అనే యువకుడు ఉండేవాడు. సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినవాడు. స్వయంగా వ్యాపారం నిర్వహించుకోగల దక్షత వచ్చాక పెద్దలు అతడికి కణ్ణగి అనే యువతితో పెళ్లి జరిపించారు. విలాసపురుషుడైన కోవలన్ భార్య బాగోగులను మరచి మాధవి అనే వేశ్యకు దాసుడవుతాడు. ఆస్తులన్నీ కరిగిపోయిన దశలో తిరిగి భార్య చెంతకు చేరుకుంటాడు. మధురై వెళ్లి వ్యాపారం చేసి మళ్లీ సంపదను సమకూర్చుకోవచ్చని భావిస్తాడు. భార్య చేతి మురుగులలో ఒకటి అమ్మి, వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటాడు. అతడు ఆ మురుగును అమ్మడానికి బజారుకు పోతాడు. దురదృష్టవశాత్తు అదే సమయానికి రాణిగారి చేతి మురుగు చోరీకి గురవుతుంది. దొంగ కోసం వెదుకులాడుతున్న రక్షక భటులు కణ్ణగి మురుగును అమ్మజూపుతున్న కోవలన్ను పట్టుకుంటారు. కణ్ణగి మురుగు కూడా రాణిగారి మురుగులానే ఉండటంతో రక్షక భటులు అతడినే దొంగగా భావించి, పాండ్య రాజు వద్దకు తీసుకొస్తారు. ఎలాంటి విచారణ లేకుండా రాజు కోవలన్కు శిరచ్ఛేద శిక్ష విధిస్తాడు. అమాయకుడైన తన భర్తకు రాజు మరణదండన విధించడంతో కణ్ణగి పట్టరాని ఆక్రోశంతో రాజాస్థానానికి చేరుకుంటుంది. తన భర్త నిర్దోషి అని చెబుతుంది. తన చేతికి ఉన్న రెండో మురుగును చూపుతుంది. అంతేకాదు, తన మురుగును పగలగొట్టి చూపుతుంది. అప్పుడు అందులోంచి మాణిక్యాలు బయటపడతాయి. రాణిగారి మురుగును పగలగొడితే అందులోంచి ముత్యాలు బయటపడతాయి. అమాయకుడైన తన భర్తను అన్యాయంగా శిక్షించినందుకు పాండ్య రాజధాని మధురై నగరం తగలబడిపోవాలని శపిస్తుంది. ఆమె శాపంతో మధురై నగరం తగలబడిపోతుంది. ఆమె అక్కడి నుంచి కేరళలోని అట్టుకల్కు చేరుకుంది. భౌతికకాయాన్ని వీడిన తర్వాత కణ్ణగి ఇక్కడ అమ్మవారిగా వెలిసిందని కూడా చెబుతారు. ఆలయ గోపురంపై చెక్కిన కణ్ణగి గాథకు చెందిన శిల్పాలనే ఇందుకు నిదర్శనంగా చూపుతారు. ఆలయ విశేషాలు... వేడుకలు అట్టుకల్ భగవతీదేవి ఆలయం పురాతన ద్రావిడ శిల్పకళా వైభవంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయ కుడ్యాలపై మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, పార్వతీపరమేశ్వరులు, దశావతారాల శిల్పాలతో పాటు కణ్ణగి గాథ, దక్షయజ్ఞం వంటి పౌరాణిక గాథలకు చెందిన శిల్పాలు ఆలయ కుడ్యాలతో పాటు స్తంభాలపైన, గోపురంపైన దర్శనమిస్తాయి. అట్టుకల్ గర్భగుడిలో అమ్మవారి విగ్రహాలు రెండు కనిపిస్తాయి. మూల విరాట్టు బంగారు తాపడంతో ఉంటుంది. దీని పక్కనే అమ్మవారి రూపురేఖలు తీర్చిదిద్దినట్లుగా కనిపించే శిలావిగ్రహం కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో శివుడు, గణపతి తదితర దేవతలకు ఉపాలయాలు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇనుమడింపజేసేలా ఉంటాయి. మలయాళ సంప్రదాయం ప్రకారం ఏటా కుంభమాసంలో పదిరోజుల పాటు ’అట్టుకల్ పొంగల్’ వేడుక జరుగుతుంది. ఈ వేడుకలో పురుషులకు ప్రవేశం నిషిద్ధం. వేడుక జరిగే పది రోజుల్లో ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. ఆరుబయట పొయ్యిలు వెలిగించి, చక్కెర పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు మహిళలు లక్షలాదిగా ఇక్కడకు చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు ఒకేచోట జరుపుకొనే వేడుకగా గిన్నిస్బుక్ 2009లోనే ‘అట్టుకల్ పొంగల్’ను గుర్తించింది. ఆ ఏడాది ఈ వేడుకలో 25 లక్షల మందికి పైగానే మహిళలు పాల్గొన్నారు. ఈ ఏడాది 30 లక్షలకు పైగానే మహిళలు ఈ వేడుకకు హాజరు కాగలరని అంచనా.