అట్టుకల్‌... అంతా మహిళలే... | Attukal Pongala | Sakshi
Sakshi News home page

అట్టుకల్‌... అంతా మహిళలే...

Mar 5 2017 1:04 AM | Updated on Aug 21 2018 2:34 PM

అట్టుకల్‌... అంతా మహిళలే... - Sakshi

అట్టుకల్‌... అంతా మహిళలే...

‘అట్టుకల్‌ పొంగల్‌’... గిన్నిస్‌ బుక్‌లో చోటు సాధించిన అరుదైన వేడుక. ఇందులో పాల్గొనే వారంతా మహిళలే.

‘అట్టుకల్‌ పొంగల్‌’... గిన్నిస్‌ బుక్‌లో చోటు సాధించిన అరుదైన వేడుక. ఇందులో పాల్గొనే వారంతా మహిళలే. ఈ వేడుకలో పురుషులకు చోటు లేదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలంతా ఒకేచోట చేరి జరుపుకొనే ఈ వేడుక అట్టుకల్‌ భగవతీదేవి ఆలయంలో జరుగుతుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో సుప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టుకల్‌ భగవతీ ఆలయం అతి పురాతనమైనది. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత ఇక్కడ భగవతీదేవిగా వెలిసింది. స్థానికులు అమ్మవారిని ‘అట్టుకల్‌ అమ్మ’గా పిలుచుకుంటారు. ఆమెను భద్రకాళిగా భావించి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అద్భుత నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అట్టుకల్‌ ఆలయం గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

కేరళలోని కులీన కుటుంబాల్లో ఒకటిగా పేరుపొందిన ముల్లువీట్టిల్‌ కుటుంబ పెద్ద అమ్మవారికి పరమభక్తుడు. ఆయన ఒకనాడు కిళియార్‌ నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాలిక అక్కడకు వచ్చింది. తాను అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి ఉందని, తనను నది దాటించాలని ఆయనను కోరింది. బాలిక ముఖంలోని దివ్యతేజస్సుకు ముగ్ధుడైన ఆ పెద్దాయన ఆమెను నది అవతలి ఒడ్డుకు చేర్చడమే కాకుండా, అక్కడకు దగ్గర్లోనే ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆయన ఇంట్లోని వాళ్లు కూడా ఆమెను చూసి ముచ్చటపడ్డారు. ఆమెకు ఘనంగా అతిథి మర్యాదలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

 వాళ్లు ఆ సన్నాహాల్లో ఉండగానే ఆమె అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. అదేరోజు రాత్రి కుటుంబ పెద్దకు అమ్మవారి రూపంలో కలలో కనిపించింది. పెద్దాయనకు చెందిన తోటలో కొలువుంటానని, తోటలో మూడు రేఖలు కనిపించే ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించాలని కోరింది. వేకువ జామునే మేలుకున్న పెద్దాయన తోటకు వెళ్లి, అమ్మవారు కలలో చెప్పిన చిహ్నాలు కనిపించిన చోట ఆలయ నిర్మాణం చేపట్టాడు. ఆ పెద్దాయన ఆహ్వానంపై బదరీనాథ్‌ ఆలయ ప్రధానార్చకుడు స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా ఇక్కడ దేవతా ప్రతిష్ఠాపన చేశారు.

కణ్ణగి గాథ
తమిళనాడులోని పుహార్‌ ప్రాంతం పాండ్య రాజుల ఏలుబడిలో ఉన్న కాలం అది. పుహార్‌ పట్టణంలో కోవలన్‌ అనే యువకుడు ఉండేవాడు. సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినవాడు. స్వయంగా వ్యాపారం నిర్వహించుకోగల దక్షత వచ్చాక పెద్దలు అతడికి కణ్ణగి అనే యువతితో పెళ్లి జరిపించారు. విలాసపురుషుడైన కోవలన్‌ భార్య బాగోగులను మరచి మాధవి అనే వేశ్యకు దాసుడవుతాడు. ఆస్తులన్నీ కరిగిపోయిన దశలో తిరిగి భార్య చెంతకు చేరుకుంటాడు. మధురై వెళ్లి వ్యాపారం చేసి మళ్లీ సంపదను సమకూర్చుకోవచ్చని భావిస్తాడు. భార్య చేతి మురుగులలో ఒకటి అమ్మి, వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటాడు. అతడు ఆ మురుగును అమ్మడానికి బజారుకు పోతాడు.

 దురదృష్టవశాత్తు అదే సమయానికి రాణిగారి చేతి మురుగు చోరీకి గురవుతుంది. దొంగ కోసం వెదుకులాడుతున్న రక్షక భటులు కణ్ణగి మురుగును అమ్మజూపుతున్న కోవలన్‌ను పట్టుకుంటారు. కణ్ణగి మురుగు కూడా రాణిగారి మురుగులానే ఉండటంతో రక్షక భటులు అతడినే దొంగగా భావించి, పాండ్య రాజు వద్దకు తీసుకొస్తారు. ఎలాంటి విచారణ లేకుండా రాజు కోవలన్‌కు శిరచ్ఛేద శిక్ష విధిస్తాడు. అమాయకుడైన తన భర్తకు రాజు మరణదండన విధించడంతో కణ్ణగి పట్టరాని ఆక్రోశంతో రాజాస్థానానికి చేరుకుంటుంది.

తన భర్త నిర్దోషి అని చెబుతుంది. తన చేతికి ఉన్న రెండో మురుగును చూపుతుంది. అంతేకాదు, తన మురుగును పగలగొట్టి చూపుతుంది. అప్పుడు అందులోంచి మాణిక్యాలు బయటపడతాయి. రాణిగారి మురుగును పగలగొడితే అందులోంచి ముత్యాలు బయటపడతాయి. అమాయకుడైన తన భర్తను అన్యాయంగా శిక్షించినందుకు పాండ్య రాజధాని మధురై నగరం తగలబడిపోవాలని శపిస్తుంది. ఆమె శాపంతో మధురై నగరం తగలబడిపోతుంది. ఆమె అక్కడి నుంచి కేరళలోని అట్టుకల్‌కు చేరుకుంది. భౌతికకాయాన్ని వీడిన తర్వాత కణ్ణగి ఇక్కడ అమ్మవారిగా వెలిసిందని కూడా చెబుతారు. ఆలయ గోపురంపై చెక్కిన కణ్ణగి గాథకు చెందిన శిల్పాలనే ఇందుకు నిదర్శనంగా చూపుతారు.

ఆలయ విశేషాలు... వేడుకలు
అట్టుకల్‌ భగవతీదేవి ఆలయం పురాతన ద్రావిడ శిల్పకళా వైభవంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయ కుడ్యాలపై మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, పార్వతీపరమేశ్వరులు, దశావతారాల శిల్పాలతో పాటు కణ్ణగి గాథ, దక్షయజ్ఞం వంటి పౌరాణిక గాథలకు చెందిన శిల్పాలు ఆలయ కుడ్యాలతో పాటు స్తంభాలపైన, గోపురంపైన దర్శనమిస్తాయి. అట్టుకల్‌ గర్భగుడిలో అమ్మవారి విగ్రహాలు రెండు కనిపిస్తాయి. మూల విరాట్టు బంగారు తాపడంతో ఉంటుంది. దీని పక్కనే అమ్మవారి రూపురేఖలు తీర్చిదిద్దినట్లుగా కనిపించే శిలావిగ్రహం కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో శివుడు, గణపతి తదితర దేవతలకు ఉపాలయాలు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇనుమడింపజేసేలా ఉంటాయి. మలయాళ సంప్రదాయం ప్రకారం ఏటా కుంభమాసంలో పదిరోజుల పాటు ’అట్టుకల్‌ పొంగల్‌’ వేడుక జరుగుతుంది.

 ఈ వేడుకలో పురుషులకు ప్రవేశం నిషిద్ధం. వేడుక జరిగే పది రోజుల్లో ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. ఆరుబయట పొయ్యిలు వెలిగించి, చక్కెర పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు మహిళలు లక్షలాదిగా ఇక్కడకు చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు ఒకేచోట జరుపుకొనే వేడుకగా గిన్నిస్‌బుక్‌ 2009లోనే ‘అట్టుకల్‌ పొంగల్‌’ను గుర్తించింది. ఆ ఏడాది ఈ వేడుకలో 25 లక్షల మందికి పైగానే మహిళలు పాల్గొన్నారు. ఈ ఏడాది 30 లక్షలకు పైగానే మహిళలు ఈ వేడుకకు హాజరు కాగలరని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement