
ప్రధాని మోదీకి 1.11 కోట్ల లేఖలు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు.
జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్‌బుక్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్‌లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్ ప్రజలు తిరగరాశారు.