పెల్లెట్ గన్స్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | SC Backs Pellet Guns in Exceptional Situations Amid Political Storm | Sakshi
Sakshi News home page

పెల్లెట్ గన్స్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Jul 30 2026 12:32 PM | Updated on Jul 30 2026 12:47 PM

SC Backs Pellet Guns in Exceptional Situations Amid Political Storm

సాక్షి, న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో జరిగిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యతిరేక నిరసనల సందర్భంగా పెల్లెట్‌ గన్స్‌ వినియోగంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని స్పష్టం చేసింది. అయితే..

పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ (exceptional), అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF) ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును (అమ్యూనిషన్‌ లాగ్‌) భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

పోలీసుల అధికారాలపై కోర్టు వ్యాఖ్యలు
పెల్లెట్‌ గన్స్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి యశోవర్ధన్‌ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్‌ గన్స్‌ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్‌ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది.

గాయపడిన వారికి చికిత్స తప్పనిసరి
నిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్‌ మంతర్‌ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

సీఆర్పీఎఫ్‌ నివేదిక ఏమంటోంది?
ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్‌ వద్ద పోలీసు చర్యపై సీఆర్పీఎఫ్‌ అంతర్గత విశ్లేషణలో అన్ని స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (SOPs) పాటించినట్లు పేర్కొంది. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మొదట ప్రజలను చెదరగొట్టేందుకు హెచ్చరికలు జారీ చేయడం, అనంతరం టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే పంప్‌ యాక్షన్‌ గన్‌ ద్వారా పెల్లెట్‌ గన్స్‌ను వినియోగించినట్లు నివేదిక వెల్లడించింది.

ఇద్దరికీ గాయాలు
ఈ ఘటనలో ముగ్గురి నుంచి ఐదుగురు నిరసనకారులు పెల్లెట్ల కారణంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, 47 మంది RAF సిబ్బంది కూడా గాయపడగా, వారిలో ఆరుగురికి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సీఆర్పీఎఫ్‌ తెలిపింది.

సిబ్బందికి అండగా డీజీ
సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ జీ.పీ. సింగ్‌ తన సిబ్బందికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల భద్రత, దేశ ప్రయోజనాల దృష్ట్యా విధి నిర్వహణలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.

కాగా, నీట్‌ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించారంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన ఓ విద్యార్థిని చూపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై మండిపడ్డారు. దీంతో ఈ అంశం పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేపింది. ఈ రాజకీయ వివాదం నడుమే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని, వాటిపై సంపూర్ణ నిషేధం అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement