ఎట్టకేలకు మన్మోహన్‌ సింగ్‌కు క్లీన్‌చిట్‌  | SCI closes coal block allocation case against former PM Manmohan Singh | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మన్మోహన్‌ సింగ్‌కు క్లీన్‌చిట్‌ 

Jul 30 2026 5:37 AM | Updated on Jul 30 2026 5:37 AM

SCI closes coal block allocation case against former PM Manmohan Singh

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌ పాత్ర లేదని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్‌ సింగ్‌కు బొగ్గు బ్లాక్‌ల అక్రమ కేటాయింపులకు సంబంధించిన కీలకమైన కేసు నుంచి ఉపశమనం లభించింది. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌ ప్రమేయం లేదని గతంలో సీబీఐ దాఖలుచేసిన నివేదికను బుట్టదాఖలుచేస్తూ 11 ఏళ్ల క్రితం ట్రయల్‌ కోర్టు మన్మోహన్‌కు ఇచ్చిన సమన్ల ఉత్తర్వును కొట్టేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. 

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన పలుకేసులను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వీ మోహనల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా 11 ఏళ్ల క్రితం ట్రయల్‌ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మన్మోహన్‌ దాఖలుచేసిన పాత పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు గుర్తుచేశారు.

 ‘‘2005లో ఒడిశాలోని తలబిరా–2 బొగ్గు బ్లాకుల కేటాయింపులో నాటి ప్రధాని, బొగ్గు శాఖ మంత్రి మన్మోహన్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు అని సీబీఐ తన ముగింపు నివేదికను ట్రయల్‌ కోర్టుకు అందజేసింది. అయినాసరే నాటి జడ్జి ఆ నివేదికను పట్టించుకోలేదు. ఇప్పుడు మన్మోహన్‌ జీవించి లేరు. ఆయనను ప్రశ్నించాలంటూ జారీ అయిన సమన్ల ఉత్తర్వుకు అర్థమేలేదు’’అని సిబల్‌ వాదించారు. దీంతో ఈయన వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించి గతంలో ట్రయల్‌ కోర్టు జడ్జి ఇచి్చన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. దీంతో మరణించిన రెండేళ్ల తర్వాత మన్మోహన్‌కు బొగ్గుకుంభకోణం కేసు నుంచి క్లీన్‌చిట్‌ వచ్చినట్లయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement