breaking news
pellet gun
-
పెల్లెట్ గన్స్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని స్పష్టం చేసింది. అయితే..పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ (exceptional), అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును (అమ్యూనిషన్ లాగ్) భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.పోలీసుల అధికారాలపై కోర్టు వ్యాఖ్యలుపెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది.గాయపడిన వారికి చికిత్స తప్పనిసరినిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్ మంతర్ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.సీఆర్పీఎఫ్ నివేదిక ఏమంటోంది?ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ వద్ద పోలీసు చర్యపై సీఆర్పీఎఫ్ అంతర్గత విశ్లేషణలో అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పాటించినట్లు పేర్కొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొదట ప్రజలను చెదరగొట్టేందుకు హెచ్చరికలు జారీ చేయడం, అనంతరం టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే పంప్ యాక్షన్ గన్ ద్వారా పెల్లెట్ గన్స్‌ను వినియోగించినట్లు నివేదిక వెల్లడించింది.ఇద్దరికీ గాయాలుఈ ఘటనలో ముగ్గురి నుంచి ఐదుగురు నిరసనకారులు పెల్లెట్ల కారణంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, 47 మంది RAF సిబ్బంది కూడా గాయపడగా, వారిలో ఆరుగురికి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.సిబ్బందికి అండగా డీజీసీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీ.పీ. సింగ్ తన సిబ్బందికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల భద్రత, దేశ ప్రయోజనాల దృష్ట్యా విధి నిర్వహణలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.కాగా, నీట్ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన ఓ విద్యార్థిని చూపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. దీంతో ఈ అంశం పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ రాజకీయ వివాదం నడుమే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని, వాటిపై సంపూర్ణ నిషేధం అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గాయాల భయానక నిజాలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా వ్యవస్థ సంస్కరణలను కోరుతూ ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరి, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సాహిల్ లోచ్బ్ (20) తదితరులు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారు.జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా పెల్లెట్ గన్ తో కాల్పులు జరిపినట్లు బాధితుల స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇర్షాద్ ముఖం, మెడ భాగంలో వందలాది చిన్న సీసపు గుళికలు (పెల్లెట్లు) దూసుకెళ్లాయి.ప్రాణాపాయం ఉన్నందున మెడలోని ప్రధాన రక్తనాళం దగ్గరున్న ఒక పెల్లెట్‌ను వైద్యులు తొలగించలేకపోయారు. దీంతో అతను జీవితాంతం ఆ లోహపు గుళికతోనే జీవించాల్సి ఉంటుంది. అలాగే సాహిల్ లోచ్బ్ తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తమ బలగాలు పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఖండించగా, సీఆర్పీఎఫ్ మాత్రం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
తుపాకీ తలకు గురిపెట్టుకుని సెల్ఫీ!
మాస్కో: సెల్ఫీ తీసుకుంటూ ఓ రష్యా మహిళ ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. తుపాకీని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకుంటూ సదరు మహిళ గాయాలపాలైందని మాస్కో పోలీసులు తెలిపారు. తన కార్యాలయంలో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడిన మహిళ సెక్యురిటీ గార్డు దగ్గర నుంచి పెల్లెట్ తుపాకీ తీసుకుంది. దాన్ని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనుకుంది. అదే సమయంలో ట్రిగ్గర్ నొక్కడంతో రబ్బరు బుల్లెట్లు ఆమె తలలోకి దూసుకుపోయి ఆస్పత్రి పాలైంది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే సమయంలో సెంట్రల్ మాస్కోలో ఆర్చ్ డ్ బ్రిడ్జి నుంచి దూకుతూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ సరదా ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ఐదో అంతస్థు నుంచి దూకుతూ 9వ తరగతి విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.


