బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్, సీపీజే (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జెన్-జీ నిరసనకారులపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పేరును కూడా తెరపైకి తెచ్చింది. సౌరవ్ దాస్ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘నా స్నేహితులు నన్ను చూస్తే యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని చెబుతుంటారు’’ అంటూ సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కంగనా వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్.. గతంలో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
జెన్-జీపై కంగనా వ్యాఖ్యలతో..
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. నిరసనల్లో పాల్గొంటున్న కొందరు యువతపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. జెన్-జీ నిరసనకారుల వీడియోలు చూస్తే అసహ్యం వేస్తోందని, వారి భాష, ప్రవర్తన తనను బాధించాయని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ఉద్దేశించి చేసిన కొన్ని ఘాటు పదజాలంపై(ఇలాంటి వాళ్లను ఎలా కంటారో..) రాజకీయ.. సినీ వర్గాలు, యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలను సౌరవ్ దాస్ తప్పుబట్టాడు.
ఆమెను సొంత పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అంటూ విమర్శించాడు. ప్రజా జీవితంలో ఉన్న ఓ ఎంపీ యువతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. జెన్-జీ తరం దేశంలో మార్పు కోసం పోరాడుతోందని, వారి గొంతును తక్కువ చేసి చూడకూడదని వ్యాఖ్యానించాడు.
కంగనా ఘాటు కౌంటర్..
సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు కంగనా కూడా అదే స్థాయిలో స్పందించారు. సౌరవ్ దాస్ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆమె.. అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు అని తెలిసింది. అతనో పనికిమాలిన వ్యక్తి అని అర్థమైంది’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. తన వయసులోనే తాను రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని, ప్రజా జీవితంలో తనకు 20 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, వ్యాపారవేత్తగా తాను ఎన్నో రంగాల్లో పనిచేశానని తెలిపారు. సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి ‘‘ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
‘యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానంటారు’
సౌరవ్ దాస్ స్పందిస్తూ కంగనా వ్యాఖ్యలపై వ్యంగ్యంగా మాట్లాడారు. తనను స్నేహితులు చూస్తే యువ హృతిక్ రోషన్‌లా కనిపిస్తానని చెబుతుంటారని అన్నారు. అయితే కంగనా మాత్రం తనపై తీవ్రంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పేరు వైరల్‌గా మారింది. ఎందుకంటే గతంలో హృతిక్, కంగనా మధ్య జరిగిన వివాదం బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అసలు హృతిక్-కంగనా వివాదం ఏంటి?
హృతిక్ రోషన్ పేరు ఇప్పుడు చర్చలోకి రావడానికి కారణం 2016లో జరిగిన వివాదమే. ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హృతిక్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని కంగనా చేసిన ఆరోపణలను హృతిక్ రోషన్ ఖండించారు. ఇద్దరూ ఒకరికొకరు లీగల్ నోటీసులు పంపించుకున్నారు. ఈ-మెయిల్స్, డిజిటల్ ఆధారాలపై కూడా దర్యాప్తు జరిగింది. అయితే తమ మధ్య సంబంధం ఉందని కంగనా చెబుతుండగా.. అలాంటి సంబంధం ఎప్పుడూ లేదని హృతిక్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఇప్పటికీ ఎటూ తేలలేదు.
మాటల యుద్ధం..
ప్రస్తుతం కంగనా రనౌత్, సౌరవ్ దాస్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్-జీపై వ్యాఖ్యలతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు కంగనాకు పర్సనల్ ఎటాక్‌లా హృతిక్ రోషన్ పేరు ప్రస్తావనకు వచ్చే స్థాయికి చేరింది. హృతిక్-కంగనా పాత వివాదాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు సౌరవ్ దాస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


