భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్‌లో మరోసారి నాయకత్వ ఘర్షణలు బహిర్గతమవుతున్నాయి. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కంటే ముందే టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విభేదాలకు ప్రధాన కారణాలు
రతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటాకు, చంద్రశేఖరన్‌కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త వ్యాపారాల్లో పురోగతి స్తంభించడం, పెరిగిన నష్టాలపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవి పొడిగింపుపై పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు నోయెల్ టాటా సుముఖంగా లేరని, మరో ఐదేళ్లకు బదులుగా కేవలం రెండేళ్ల కాలాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజీఎంలో ఓటింగ్ ద్వారా వివాదాస్పదంగా తప్పుకోవడం కంటే ముందే గౌరవప్రదంగా రాజీనామా చేయాలని చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు.
చట్టపరమైన ప్రాధాన్యత.. చిక్కులు
ఈ వివాదానికి మరింత సంక్లిష్టతను చేకూర్చింది మహారాష్ట్ర చారిటీ కమిషనర్ నిర్ణయం. పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ఉల్లంఘనల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ ఎలాంటి కీలక సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. టాటా సన్స్‌లో దాదాపు 66% వాటా కలిగిన ట్రస్టుల ప్రతినిధులు లేకుండా ఏజీఎం నిర్వహణ, ఓటింగ్ చెల్లుబాటుపై చట్టపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్, గ్రూప్‌ను ఆధునిక సాంకేతిక, ఏవియేషన్ రంగాల వైపు విజయవంతంగా నడిపించారు. ఒకవేళ ఆయన ఏజీఎంకు ముందే తప్పుకుంటే గ్రూప్ షేర్లపై తాత్కాలిక ఒత్తిడి పెరగడంతో పాటు మళ్లీ కొత్త చైర్మన్ అన్వేషణ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’


