ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. వచ్చే దశాబ్దకాలంలో (2035 నాటికి) ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించి రూ. 8 లక్షల కోట్లకు వృద్ధి చెందనున్న మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు.
ప్రీమియం ఉత్పత్తులు, యువ జనాభా ఇందుకు తోడ్పడనున్నట్లు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇతర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా కూడా అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాల్లో విస్తరిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కొనుగోలుదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాధనాలను ఉపయోగిస్తున్నట్లు పురి తెలిపారు.
ఆన్‌లైన్, క్విక్ కామర్స్ మాధ్యమాలు వేగంగా విస్తరిస్తున్నాయని, స్మార్ట్ సరఫరా వ్యవస్థలు అనేక ఉత్పత్తులను కొనుగోలుదారుల ఇంటి వద్దకు సురక్షితంగా చేరుస్తున్నాయని చెప్పారు. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 30 పైగా ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఉన్నాయని పురి తెలిపారు.
2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,720 కోట్లుగా ఉన్న ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,200 కోట్లకు ఎగిసిందన్నారు. మరోవైపు పాలసీలపరంగా వివిధ సంస్కరణల తోడ్పాటుతోనే భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుస్తోందని పురి తెలిపారు.


