సబ్బు నుంచి బిస్కెట్‌ వరకు.. అన్నింటిపై ధరల మోత | Global Crisis Impact, FMCG Companies Set For Another Price Hike As Global Costs Surge, More Details Inside | Sakshi
Sakshi News home page

సబ్బు నుంచి బిస్కెట్‌ వరకు.. అన్నింటిపై ధరల మోత

May 13 2026 8:33 AM | Updated on May 13 2026 10:01 AM

Global Crisis Impact: FMCG Companies Prepare for Another Price Hike

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు కొన్ని ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను కొంత మేర పెంచడంతోపాటు.. ప్యాక్‌ల బరువును (పరిమాణం/గ్రాములు) సైతం తగ్గించాయి. ఇప్పుడు మరో విడత, తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి అవి సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, పానీయాల ధరలు మరింత పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు, గ్యాస్‌ సరఫరాకు ఆటంకాలు ఏర్పడడం తెలిసిందే. దీంతో వీడి ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి ఫలితంగా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. 

ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర ప్యాకేజింగ్‌ వస్తువుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. వీటి తయారీలోకి వినియోగించే ముడిసరుకులకు ముడిచమురు ఆధారం కావడం గమనార్హం. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో ముడి సరుకుల వ్యయాలు పెరిగాయి. దీంతో కంపెనీలు లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి అవి రేట్ల పెంపుతోపాటు, ప్యాక్‌ సైజులను తగ్గించేస్తున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్‌ మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

  • ధరల పెంపు.. 
    ఇప్పటికే డాబర్, హెచ్‌యూఎల్, బ్రిటానియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచేశాయి. మరింత పెంచే అవకాశం కూడా ఉందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఫలితాల వెల్లడి అనంతరం అనలిస్ట్‌ల కాల్‌లో పేర్కొన్నాయి. అలాగే, ప్రాచుర్యం పొందిన చిన్న ప్యాకెట్ల (రూ.5, 10, 15 రూపాయల ప్యాకెట్లు) ధరను మార్చకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తద్వారా తమ విక్రయాలు ప్రభావితం కాకుండా, మార్జిన్లను కాపాడుకునేందుకు ఎఫ్‌ఎంసీజీ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. 

  •  డాబర్‌ ఇండియా ఇప్పటికే ఉత్పత్తుల ధరలను 4 శాతం వరకు పెంచింది. తమపై 10 శాతం మేర ద్రవ్యోల్బణం (ముడి సరుకుల వ్యయాల పెరుగుదల) ప్రభావం ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్‌ మల్హోత్రా తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, అమ్మకాల్లో డబుల్‌ డిజిట్‌ వృద్ధి (ధరల పెంపు, అమ్మకాల పెంపు రూపంలో) నమోదు చేస్తామని చెప్పారు.  

  • ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20 శాతం వరకు పెరిగినందున ధరల పెంపుతోపాటు, పరిమాణం తగ్గింపు తప్పనిసరని అని బ్రిటానియా పేర్కొంది. ప్యాకేజింగ్‌లోకి వాడే లామినేట్స్‌ ధరల మంట సంస్థపై పడుతోంది. దీనికితోడు ఎల్‌పీజీ, పీఎన్‌జీపై ఆధారపడి ఉండడంతో మార్జిన్లపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది.  

  • తమ ముడి పదార్థాల ధరలు 40–50% పెరిగాయని, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేయక తప్పదని పిడిలైట్‌ స్పష్టం చేసింది. ప్రముఖ బ్రాండ్‌ ఫెవికాల్‌ ధరలను 12–15% మేర పెంచింది. ఈ సంస్థ ఉత్పత్తులకు ముడిచమురు డెరివేటివ్స్‌ కీలకం కాగా, వాటి ధరలు సగటున 40–50% వరకు పెరిగాయి.  

  • వరుణ్‌ బెవరేజెస్‌ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. 

  • తమకు కొబ్బరి ధరలు దిగిరావడం కలిసొచి్చందని.. ఇతర ముడి సరుకుల ధరల ఒత్తిళ్లను ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచడం, వ్యయ నియంత్రణ చర్యలతో అధిగమిస్తామని మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా ప్రకటించారు.  

  • ప్యాకేజింగ్, ఎల్‌పీజీ ధరలు పెరిగిపోవడంతో మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నట్టు టాటా కన్జ్యూమర్‌ ఎండీ, సీఈవో సునీల్‌ డిసౌజ తెలిపారు. వైవిధ్యమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నందున ఈ ఒత్తిళ్లను ప్రస్తుతానికి అధిగమించగలమని చెప్పారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement