ఐటీసీ వార్షిక వినియోగదారుల వ్యయం రూ.37,000 కోట్లు  | ITC non-cigarette FMCG portfolio crossed Rs 37000 crore in Fy 2026 | Sakshi
Sakshi News home page

ఐటీసీ వార్షిక వినియోగదారుల వ్యయం రూ.37,000 కోట్లు 

Jun 28 2026 4:29 AM | Updated on Jun 28 2026 4:29 AM

ITC non-cigarette FMCG portfolio crossed Rs 37000 crore in Fy 2026

2025–26 ఆర్థిక సంవత్సరంలో 8.8% వృద్ధి 

28 కోట్ల కుటుంబాలకు చేరిన ఉత్పత్తులు 

సిగరెట్ల విభాగం నుంచే సింహభాగం  

వంద కొత్త ఉత్పత్తులతో దూకుడు 

ఐటీసీ వార్షిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ సంస్థ ఐటీసీ ఎఫ్‌ఎమ్‌సీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) విభాగంలో తన తన దూకుడును కొనసాగిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీకి చెందిన ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులపై వినియోగదారులు చేసిన మొత్తం వార్షిక వ్యయం 8.8 శాతం పెరిగి రూ.37,000 కోట్లకు చేరిందని కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్‌లోనే నెంబర్‌వన్‌ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఐటీసీ ఉత్పత్తులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల కుటుంబాలకు చేరుతున్నాయని తెలిపింది. 

మూడేళ్లుగా తిరుగులేని వృద్ధి 
గడిచిన మూడేళ్లుగా ఐటీసీ ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులపై వినియోగదారుల వ్యయం స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.29,000 కోట్లుగా ఉండగా, 2023–24లో 12% వృద్ధితో రూ.32,500 కోట్లకు చేరింది. 2024–25లో మరో 4.6 % పెరిగి రూ.34,000 కోట్లకు చేరగా, 2025–26లో రూ.37,000 కోట్ల మార్కును దాటింది. 2022–23 నుంచి 2024–25 మధ్య రెండేళ్లలోనే వినియోగదారుల వ్యయం సుమారు రూ.5,000 కోట్ల మేర పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. 

∙2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం ద్వారా ఐటీసీ రూ.24,209.75 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం అధికం. కంపెనీ లెక్కల ప్రకారం, వార్షిక వినియోగదారుల వ్యయంలో బ్రాండ్ల నికర అమ్మకాలు, పంపిణీ మార్జిన్లు, పన్నులు కూడా భాగంగా పరిగణిస్తారు. 

మార్కెట్లో 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు 
ప్రస్తుతం ఐటీసీ ఎఫ్‌ఎమ్‌సీజీ పోర్ట్‌ఫోలియోలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్‌మేట్, యిప్పీ, మంగళ్‌దీప్‌ వంటి దాదాపు 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో ఆశీర్వాద్‌ (గోధుమ పిండి), బింగో (స్నాక్స్‌), సన్‌ఫీస్ట్‌ (క్రీమ్‌ బిస్కెట్లు), క్లాస్‌మేట్‌ (నోట్‌బుక్స్‌) తమ తమ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి. వినియోగదారుల మారుతున్న అలవాట్లకు అనుగుణంగా ఐటీసీ గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి దాదాపు 100 కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయడం విశేషం. 

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం 
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ముడిసరుకులు, ఇంధన ధరలు భారీగా పెరిగాయని, దీనివల్ల స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తలెత్తాయని ఐటీసీ పేర్కొంది. అయితే, ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మార్కెట్లో తమ పోటీతత్వాన్ని, వృద్ధి వేగాన్ని కాపాడుకోవడానికి అన్ని విభాగాలలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 

భవిష్యత్‌ వృద్ధికి ప్రత్యేక వ్యూహం 
ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారంలో తదుపరి వృద్ధి దశపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్న, తలసరి వినియోగం పరిమితంగా ఉన్న విభాగాల్లో విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీసీ భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 30కు పైగా ప్రధాన బ్రాండ్ల బలాన్ని ఉపయోగించుకుని విలువ ఆధారిత (వాల్యూ యాడెడ్‌) కొత్త ఉత్పత్తులు, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ప్రవేశించడం కంపెనీ వ్యూహంలో కీలక భాగమని తెలిపింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను రూపొందించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. 

అంతర్జాతీయ విస్తరణ 
భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఐటీసీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో భారత్‌కు సమీపంలోని వ్యూహాత్మక మార్కెట్లలో మరింత విస్తరించడం ద్వారా తదుపరి వృద్ధిని సాధించాలని ఐటీసీ లక్ష్యంగా పెట్టుకుంది.  

సంజీవ్‌ పురి వేతనం 7 శాతం డౌన్‌ 
గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి మొత్తం వేతనం రూ. 23.91 కోట్లకు పరిమితమైంది. పర్ఫార్మెన్స్‌ బోనస్, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు / కమీషన్లు తగ్గడంతో అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.8 శాతం క్షీణించింది. తాజాగా కన్సాలిడేటెడ్‌ శాలరీ రూ. 3.85 కోట్లతో పాటు పనితీరు ఆధారిత బోనస్, కమీషన్లు మొదలైన వాటి రూపంలో రూ. 19.17 కోట్లు లభించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెమ్యూనరేషన్‌ రూ. 25.66 కోట్లు.

ఆదాయంలో సిగరెట్లదే సింహభాగం 
ఐటీసీ మొత్తం స్థూల ఆదాయంలో సిగరెట్ల విభాగమే ఇప్పటికీ అతిపెద్ద వాటాగా కొనసాగుతోంది. కంపెనీ ప్రొడెక్ట్స్, సర్వీసుల అమ్మకాల ద్వారా సాధించిన మొత్తం స్థూల ఆదాయం రూ.80,867.49 కోట్లు కాగా.. అందులో కేవలం సిగరెట్ల అమ్మకాల ద్వారానే రూ.37,099.65 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే కంపెనీ మొత్తం ఆదాయంలో దీని వాటా దాదాపు 45.9 శాతంగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement