ట్రంప్‌ దూసిన వీసా కత్తి! | Sakshi Editorial On Donald Trump Effect On US Visa | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ దూసిన వీసా కత్తి!

Jul 18 2026 12:53 AM | Updated on Jul 18 2026 1:19 AM

Sakshi Editorial On Donald Trump Effect On US Visa

మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్‌వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్‌ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్‌ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్‌రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. 

ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్‌షిప్‌లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్‌’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్‌ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్‌కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. 

తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్‌ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్‌ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్‌ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్‌టీ, కస్టమ్స్‌ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్‌లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. 

వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్‌ భారత్‌’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్‌ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్‌ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement