22 కోట్ల మంది ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపాటు
ఓటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వెల్లడి
వాషింగ్టన్: 2020 నాటి అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఓటింగ్ వ్యవస్థలో అత్యంత ఆందోళనకరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వైట్‌హౌస్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అప్పట్లో తన ప్రత్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కుట్రలు సాగించిందని, ఆ విషయాన్ని నిర్ధారించే వందలాది నిఘా ఫైళ్లను తాను బహిర్గతం చేశానని చెప్పారు.
తన వ్యక్తిగత సమాచారంతో సహా 22 కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా అక్రమంగా సేకరించిందని మండిపడ్డారు. 18 రాష్ట్రాల్లోని ఓటర్ల డేటాను చైనా కొనుగోలు చేసిందని, దొంగిలించిందని లేదా హ్యాక్ చేసిందని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని నిఘా అధికారులు ప్రభుత్వానికి గానీ, కాంగ్రెస్‌కు గానీ చెప్పలేదని నిందించారు. అమెరికా పౌరులు కాని 2,78,000 మంది ఓటర్లుగా నమోదైనట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓటర్లకు సంబంధించిన సమాచారం చాలావరకు బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది.
అయితే, ఓటింగ్ విధానాలను మార్చడానికి లేదా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా ఈ సమాచారాన్ని వాడుకుందని తేల్చడానికి ట్రంప్ ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ జోక్యం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సాక్ష్యాధారాలను మాత్రం బయటపెట్టడం లేదు.
మరోవైపు, కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని బలమైన నమ్మకం ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 2021 నాటి నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రజామోద రేటింగ్ 37 శాతానికి పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. జీవన వ్యయం పెరగడం, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడయ్యింది.
ప్రత్యక్ష ప్రసారం చేయాలా? వద్దా?
తన ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసార, కేబుల్ వార్తా సంస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. ప్రసారం చేయాలా? వద్దా? అనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. అమెరికా మీడియా సంస్థల్లో తన వ్యతిరేకులు ఉన్నారని ట్రంప్ చాలా రోజులుగా ఆక్షేపిస్తున్నారు.
మీడియాపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీడియా సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోట్లాది డాలర్ల విలువైన మన ప్రజా ఆస్తి ఎయిర్‌వేవ్స్‌ను (ప్రసార తరంగాలను) ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వాడుకుంటున్నాయి. మాకు కావాల్సిందల్లా ఎన్నికలు, వార్తల ప్రసారంలో నిజాయితీ మాత్రమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రసంగాన్ని కొన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా, మరికొన్ని చేయలేదు.
ట్రంప్ ఆరోపణలు అవాస్తవం: చైనా
అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అమెరికా అధ్యక్షుడి వాదనలు కల్పితం, దురుద్దేశపూర్వకం అని స్పష్టంచేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్‌కు సూచించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం పేర్కొన్నారు.
అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎల్లప్పుడూ ఎవరు జోక్యం చేసుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సాధారణ పౌరులపై ఎవరు నిఘా పెడతారో, విదేశీ పౌరుల డేటాను ఎవరు దొంగిలిస్తారో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. సొంత ప్రవర్తనను సమీక్షించుకోవాలని అమెరికాకు హితవు పలికారు. చైనాను ఎన్నికల అంశంగా వాడుకోవద్దని, చైనా–అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింత కృషి చేయాలని అమెరికాకు స్పష్టంచేశారు.


