బ్రిటిష్‌ ‘లేబర్‌’ గట్టెక్కేదెలా? | Andy Burnham inches closer to power in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ ‘లేబర్‌’ గట్టెక్కేదెలా?

Jun 25 2026 3:47 AM | Updated on Jun 25 2026 3:47 AM

Andy Burnham inches closer to power in Britain

అధికారానికి దూరంగా దాదాపు 14 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణలో గడిపిన లేబర్‌ పార్టీని 2024 జూలైలో విజయపథాన నడిపించి, 411 సీట్లు సాధించిపెట్టిన బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రెండేళ్లు తిరక్కుండా విఫల నేతగా ముద్రపడి నిష్క్రమించబోతున్నారు. ఆయన స్థానంలో పార్టీ నేతగా ఎన్నికై వచ్చేనెల 17 తర్వాత ప్రధాని పగ్గాలు చేపడతారని అందరూ భావిస్తున్న ఆండీ బర్న్‌హామ్‌ గురించి పార్టీలో అంచనాలు దండిగానే ఉన్నాయి. బర్న్‌హామ్‌ వాటిని అందుకోగలిగితే 2029లో పార్టీ మరోసారి అధికారంలోకి రాగలుగుతుంది. 1760లో పారిశ్రామిక విప్లవానికి బీజంపడిన ఉత్తర ఇంగ్లండ్‌లోని గ్రేటర్‌ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్‌ సాధించిన ఘన విజయాలు తక్కువేమీ కాదు. 

2017లో నగర బాధ్యతలు స్వీకరించాక... నాలుగు దశాబ్దాలుగా ప్రైవేటు రంగంలో ఉంటూ, నాసిరకం సేవలతో జనాన్ని ఇబ్బందులపాలుచేసిన బస్సు రవాణాను తిరిగి ప్రభుత్వ రంగ నియంత్రణలోకి తీసుకొచ్చారు. బస్సులు, ట్రామ్‌లు, సైక్లింగ్‌ మార్గాలను అనుసంధానిస్తూ లండన్‌ తరహా ‘బీ నెట్‌ వర్క్‌’ను ఏర్పాటుచేశారు. ప్రజలకు మెరుగైన, చవకైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. గ్రేటర్‌ మాంచెస్టర్‌ను యూరప్‌లోనే అత్యంత పర్యావరణహిత నగరాల్లో ఒకటిగా మార్చేందుకు కృషి చేశారు. 

ఈ విజయాలే ఈ నెల మొదట్లో మాంచెస్టర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన్ను ఎంపీగా నెగ్గించాయి. బర్న్‌హామ్‌ ప్రధాని పదవికి పోటీపడగలరని ఎవరూ అనుకోలేదు. పార్లమెంటుకొచ్చి నిండా నెల రోజులు కాకుండానే పార్టీ నాయకత్వానికి సంసిద్ధమని ఆయన ప్రకటించటం, స్టార్మర్‌ ప్రధాన ప్రత్యర్థిగా అంతవరకూ అనుకున్న మాజీ ఆరోగ్యమంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ బర్న్‌హామ్‌కే మద్దతిస్తున్నట్టు ప్రకటించటంతో అందరూ విస్మయపడ్డారు. 

నిజానికి 2024 ఎన్నికల్లో లేబర్‌ విజయంలో స్టార్మర్‌ దీక్షాదక్షతలొక్కటే పనిచేయలేదు. అప్పటికే అంతర్గత కలహాలతోవున్న కన్సర్వేటివ్‌ పార్టీ బోరిస్‌ జాన్సన్, లిజ్‌ ట్రస్, రిషి సునాక్‌లను ప్రధానులుగా తెచ్చినా కుదుటపడలేకపోయింది. ఈ రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇలాంటి దశలో స్టార్మర్‌ పగ్గాలు చేపట్టి పార్టీని తీవ్ర వామపక్ష విధానాలనుంచి మధ్యేవాద పథానికి తీసుకొచ్చారు. 

గతంలో లేబర్‌ నేత టోనీ బ్లెయిర్‌ ప్రధానిగా దేశాన్ని భ్రష్టుపట్టించిన వైనం జనం మరిచేలా చేసి, తటస్థుల ఓట్లు సైతం రాబట్టారు. అయితే ఎన్నికల్లో నెగ్గటం వేరు... ప్రభుత్వాధినేతగా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, దేశాన్ని సంక్షోభంనుంచి గట్టెక్కించటం వేరు. ఈయూ నుంచి తప్పుకుంటే దేశం బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తుందని నమ్మి పదేళ్ల క్రితం దానివైపు మొగ్గిన జనం అన్నివిధాలా నష్టపోయామని ఆలస్యంగా గ్రహించారు. తిరిగి ఈయూలో చేరాలనే స్వరాలు పెరిగాయి. ఈ విషయంలో తన వైఖరేమిటో స్టార్మర్‌ చెప్పలేదు.

అసమానతల్నీ, దారిద్య్రాన్నీ పారదోలటానికి... జనం ఎదుర్కొంటున్న ఆవాస సమస్యను అధిగమించటానికి ఏం చేయాలన్న ప్రణాళికలకు బదులు అంతకంతకూ బలపడుతున్న తీవ్ర మితవాద పక్షం రీఫామ్‌ యూకే పార్టీని ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే ఆయన దృష్టి పెట్టారు. నైజెల్‌ ఫరాజ్‌ నాయకత్వంలోని ఆ పార్టీని అనుకరించే ప్రయత్నం చేశారు. గాజాలో ఇజ్రాయెల్‌ సాగించిన నరమేధాన్ని సమర్థించటం, దాన్ని ఖండిస్తూ ఉద్యమించిన పాలస్తీనా యాక్షన్‌ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించటం, వలసలపైనా ఆంక్షలు విధించటంలాంటివి చేశారు. 

ఫరాజ్‌ పార్టీని కాపీ కొడితేనే దాన్ని ఓడించటం సులభమన్న ఆయన తెలివితక్కువతనం లేబర్‌ పార్టీకి శాపంగా మారింది. ఉత్తర ఇంగ్లండ్, మిడ్‌లాండ్స్‌ వంటి కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో లేబర్‌ చేతుల్లోవున్న వేలాది కౌన్సిలర్‌ స్థానాల్నీ, కౌన్సిళ్లనూ ఫరాజ్‌ పార్టీ కైవసం చేసుకుంది. జాతీయ సర్వేల్లో సైతం ఏకంగా 27 శాతం వరకూ ఓటింగ్‌ సాధించి లేబర్‌ను మూడో స్థానంలోకి నెట్టింది. దాంతో లేబర్‌ ఎంపీలంతా వణికిపోయారు.  స్టార్మర్‌ను సాగనంపకుంటే భవిష్యత్తు శూన్యమని గ్రహించారు. నైతికత, సిద్ధాంతాలు లేకుండా గాలివాటు రాజకీయాలకు పాల్పడితే జనం మెచ్చరని స్టార్మర్‌ ప్రస్థానం నిరూపించింది. బర్న్‌హామ్‌ ఆయన్నుంచి గుణపాఠం నేర్చుకుని సమర్థ పాలన అందించగలిగితే లేబర్‌ కోలుకోవటం ఖాయం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement