లండన్‌లోని ప్రతిష్ఠాత్మక 10 డౌనింగ్ స్ట్రీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయంల కూడా. బయటకు చూస్తే అది కేవలం ఒక ప్రభుత్వ భవనం. కానీ ఆ చారిత్రక గోడల మధ్య మాత్రం ఒక ప్రత్యేకమైన ఉనికి ఎప్పటినుంచో కొనసాగుతోంది. పదేళ్లలో ఆరుగురు ప్రధానమంత్రులు మారినా, ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో.. దశాబ్దంపైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ల్యారీ..
“నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. అప్పుడు ఒక ప్రధాని ఉన్నాడు. తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఇంకొకరు. ఇప్పుడే ఇంకొకరు రాజీనామా చేశారు. రేపు ఇంకెవరో?.. నేను మాత్రం నా సోఫాలో అలాగే ఉంటూ వస్తున్నా..” అంటూ ల్యారీగాడు ఓ వెక్కిరింపు చూస్తున్నాడు.
ల్యారీ.. 11 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో బ్రిటన్‌కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరప్‌తో బ్రిటన్ సంబంధాలపై, ఆర్థిక సంక్షోభం ప్రభావాలపై చర్చల్లో మునిగిపోయి ఉన్న సమయం అది. కానీ ల్యారీకి అవేం పట్టింపు లేదు. వాడికి అర్థమైంది ఒక్కటే.. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, మంచి తిండి.. అలాగే రొటీన్ లైఫ్‌లో కాస్త చేంజ్.

ఆ తర్వాత మార్పుల ప్రవాహం మొదలైంది. థెరెసా మే వచ్చారు. బ్రెగ్జిట్ గందరగోళం మధ్య దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, పార్లమెంటులో మద్దతు తగ్గడం, ఒప్పందాలపై విభేదాలు ఆమెను పదవికి రాజీనామా చేసేలా చేశాయి. ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. డౌనింగ్ స్ట్రీట్‌ను వీడుతుంటే ల్యారీ మాత్రం అదే హాలులో నిద్రపోతూనే ఉన్నాడు.
తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. దేశాన్ని బ్రెగ్జిట్ తర్వాత కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీల్లో వివాదాలు, కరోనా సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆచరణాత్మక తప్పిదాల ఆరోపణలు ఆయనను కూడా పదవికి దూరం చేశాయి. ఆయన బయటకు వెళ్తున్న టైంలోనూ.. ల్యారీగాడు సోఫాలో మాంచి కునుకు తీస్తున్నాడు.

తరువాత లిజ్ ట్రస్ వచ్చారు. అయితే ఆర్థిక విధానాల్లో ఆమె చేసిన భారీ ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె పాలన అయితే బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువకాలంలో ముగిసిన అధ్యాయంగా నిలిచింది. “లెట్యూస్(ఆ రకం ఆకుకూర..) తాజాదనం కంటే ఆమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది అంటూ సెటైర్లు వినిపించాయి. కానీ, అవేవీ పట్టించుకునే స్థితిలో ల్యారీగాడు లేడు..
తర్వాత రిషి సునాక్ వచ్చారు. ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించాయి. చివరకు 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు లేబర్ పార్టీ చేతికి మారాయి. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో సునాక్ ప్రధానమంత్రి పదవికి వీడ్కోలు పలికారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ల్యారీగాడు తనదైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు.

తరువాత బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ పాలన కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. దేశ ఆర్థిక ఒత్తిళ్లు, విధాన నిర్ణయాలపై పెరిగిన విమర్శల మధ్య ఆయన నాయకత్వంపై కూడా అనిశ్చితి కొనసాగింది. చివరికి ఆయన కూడా పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తాజాగా మరోసారి నాయకత్వ మార్పు తప్పలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నా, ఆ చారిత్రక భవనంలోని నిశ్శబ్ద సాక్షి మాత్రం ఎప్పటిలాగే తన స్థానంలో నిలిచే ఉంది.

లారీకి రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.. ఈ ఇంట్లో మనుషులు శాశ్వతం కాదు. వారు వస్తారు, కెమెరాల ముందు నిలుస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, కొన్నిసార్లు దేశాన్ని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు విమర్శల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కానీ లారీ మాత్రం ఎప్పటికీ అదే చోట ఉంటాడు. అదే కిటికీ దగ్గర కూర్చుంటాడు. అదే హాలులో నిద్రపోతాడు. అతనికి పదవులు లేవు, ఎన్నికలు లేవు, రాజీనామాలు లేవు. అతని ప్రపంచంలో ఒకే ఒక నిజం ఉంది.. ఆ ఇల్లు, ఆ సోఫా బతికి ఉన్నంత దాకా తనదేనని.

ల్యారీ ది క్యాట్ (Larry the Cat).. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ప్రసిద్ధ పిల్లి. ఎలుకల్ని పట్టుకునేందుకు “Chief Mouser to the Cabinet Office” అనే అధికారిక హోదాను దానికి కట్టబెట్టారు. అలాగని ఈ పదవి కొత్తది కాదు. అక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలుకల సమస్యను నియంత్రించేందుకు దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ఈ బాధ్యతలను సాధారణంగా క్యాబినెట్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది చూసుకుంటారు, అయితే ఈ పిల్లుల సంరక్షణ, ఆహారం, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అక్కడి సిబ్బందే నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ల్యారీ 2011 నుంచి ఈ భవనంలో ఉంటూ, అనేక ప్రధానమంత్రుల కాలాన్ని సాక్షిగా చూసిన ఒక నిశ్శబ్ద అధికారిగా గుర్తింపు పొందాడు.


