రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా! | Rs 45 Lakh Salary Yet Zero Savings Techie Viral Struggle Lifestyle Inflation | Sakshi
Sakshi News home page

రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా!

Jun 29 2026 12:02 PM | Updated on Jun 29 2026 12:17 PM

Rs 45 Lakh Salary Yet Zero Savings Techie Viral Struggle Lifestyle Inflation

సంవత్సరానికి రూ.45 లక్షల భారీ ప్యాకేజీ.. సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్.. కానీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ పరిస్థితి. గతేడాది మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ అన్షుమన్ శర్మతో సూర్య అనే టెక్కీ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

గత 14 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన సూర్య.. తన భార్య, మూడున్నరేళ్ల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాదికి రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ పన్నుల చెల్లింపుల తర్వాత ప్రతి నెలా అతని చేతికి వచ్చే నికర జీతం రూ.2,45,000. ఈ భారీ మొత్తం చేతికి వస్తున్నా పొదుపు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని సూర్య వాపోయాడు.

ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. నెలాఖరు వచ్చేసరికి నా డబ్బు ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. చేతిలో ఏమీ మిగలడం లేదు. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల నా సిప్‌ పెట్టుబడులను కూడా పెంచలేకపోతున్నాను’ అని చెప్పాడు.

ఖర్చుల లెక్కలు ఇవే..

సూర్య తన నెలవారీ ఖర్చుల వివరాలను కన్సల్టెంట్‌కు వివరించగా అందులో సింహభాగం హోమ్‌లోన్‌కే వెళ్తున్నట్లు చెప్పారు. అతని నెలవారీ ఖర్చుల విభజన ఇలా ఉంది.

హోమ్ లోన్ ఈఎంఐ: రూ. 63,000 (ఇది అతని నికర ఆదాయంలో 30% కంటే తక్కువలోనే ఉండటం గమనార్హం)

కుమారుడి స్కూల్ ఫీజు: రూ.11,000 (దీనికి అదనంగా రూ.3 లక్షల ప్రవేశ రుసుము ఉంది)

ఆహారం, కిరాణా సామాగ్రి: రూ. 12,000

ఇతర గృహ ఖర్చులు: రూ. 20,000

షాపింగ్, ట్రిప్పులు, ఔటింగ్స్: రూ.32,000

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు

ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్‌లో రీపోస్ట్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం కంటే పేలవమైన ఆర్థిక ప్రణాళికే పెద్ద సమస్య. నెలకు రూ.2.45 లక్షలు సంపాదిస్తూ కేవలం షాపింగ్, ట్రిప్పుల కోసమే రూ.32 వేలు ఖర్చు చేయడం ఏంటి? బాబు నర్సరీ ఫీజులకే అంత పెడుతుంటే ఇక డబ్బు ఎలా మిగులుతుంది?’ అని ఒక యూజర్‌ చెప్పారు. మరోవైపు, ఈ వాదనను వ్యతిరేకిస్తూ కొంతమంది సూర్యకు మద్దతుగా నిలిచారు. ‘ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తూ, తన పిల్లలకు మంచి చదువు చెప్పించి, కాస్త విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి?’ అని కౌంటర్ ఇచ్చారు.

ఈ బెంగళూరు టెక్కీ ఉదంతం కేవలం ఒక్కరి సమస్య కాదు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అధిక వేతనాలు పొందుతున్న మెజారిటీ ఐటీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు, ఖర్చులు పెంచుకుంటూ పోవడాన్ని ఆర్థిక పరిభాషలో ‘లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్’ అంటారు. రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నా ఏమీ మిగలడం లేదు అనే భావన కలగడానికి కారణం.. భవిష్యత్తు కోసం చేసే పొదుపును ముందే పక్కన పెట్టకుండా, ఖర్చులు పోగా మిగిలినదాన్ని దాచుకుందాం అనుకోవడమేనని కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement