సోషల్ మీడియాలో ఫుడ్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇకపై ఏదిపడితే అది చెప్పేయడానికి వీల్లేదు. ఆహార ఉత్పత్తులపై తప్పుడు, అతిశయోక్తి లేదా ధ్రువీకరించని క్లెయిమ్‌లను ప్రచారం చేయొద్దంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా హెచ్చరించింది. ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు అందులోని క్లెయిమ్‌లు నిజమైనవా, ధ్రువీకరించగలిగినవా, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.
‘గొప్ప ప్రభావంతో గొప్ప బాధ్యత వస్తుంది’ అనే సందేశంతో FSSAI ఈ అంశాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో తమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఇన్‌ఫ్లుయెన్సర్లకు సూచించింది. ధ్రువీకరించని లేదా తప్పుదోవ పట్టించే ఆహార క్లెయిమ్‌లను ప్రచారం చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆరోగ్య ప్రయోజనాల క్లెయిమ్‌లపై నిఘా
హెల్త్ డ్రింక్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులకు సోషల్ మీడియా ప్రమోషన్లు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఇమ్యూనిటీని పెంచుతుంది’, ‘పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది’ వంటి ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లను ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేయకూడదని FSSAI సూచిస్తోంది.
FSSAI నిబంధనల ప్రకారం ఆహార ఉత్పత్తులపై చేసే క్లెయిమ్‌లు నిజమైనవి, స్పష్టమైనవి, అర్థవంతమైనవి, వినియోగదారులను తప్పుదోవ పట్టించనివిగా ఉండాలి. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్‌లకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రకటనలోని క్లెయిమ్‌లు ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న సమాచారంతోనూ సరిపోవాలి.
‘100%’ క్లెయిమ్‌లపైనా కఠిన వైఖరి
ఆహార రంగంలో ‘100% ప్యూర్’, ‘100% నేచురల్’, ‘100% ఆర్గానిక్’ వంటి పదాల వినియోగంపై కూడా FSSAI ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. ‘100%’ అనే పదం ఆహార నిబంధనల్లో లేదని, ఇలాంటి క్లెయిమ్‌లు వినియోగదారుల్లో ఉత్పత్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనదనే తప్పుదారి పట్టించే భావన కలిగించే అవకాశం ఉందని రెగ్యులేటర్ గతంలో స్పష్టం చేసింది.
తాజాగా డాబర్ ఇండియా విషయంలోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు తదితర ఉత్పత్తులపై ‘100%’ క్లెయిమ్‌లను FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంలో తాజా పరిణామంగా ఢిల్లీ హైకోర్టు FSSAI ఆదేశంపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో డాబర్‌కు ప్రస్తుతం సంబంధిత ఉత్పత్తులను విక్రయించేందుకు తాత్కాలికంగా అవకాశం లభించింది. కేసు కోర్టు పరిశీలనలో ఉంది.
ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఉన్న బాధ్యతలు
ఫుడ్ ప్రమోషన్ల విషయంలో FSSAI నిబంధనలతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన 2022లోని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఎండార్స్‌మెంట్ల మార్గదర్శకాలు కూడా కీలకంగా ఉన్నాయి. వీటి ప్రకారం సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు తగిన డ్యూ డిలిజెన్స్ చేయాలి. వారి ఎండార్స్‌మెంట్ నిజమైన అభిప్రాయం లేదా అనుభవాన్ని ప్రతిబింబించాలి. తప్పుడు లేదా మోసపూరిత క్లెయిమ్‌లకు మద్దతు ఇవ్వకూడదు.
ఆరోగ్యం, వెల్‌నెస్ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేక మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నాయి. క్లెయిమ్‌లకు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో పరిశీలించడం, అవసరమైనప్పుడు ఆధారాలు లేదా మూలాలను వెల్లడించడం, తప్పుడు లేదా అతిశయోక్తి సమాచారాన్ని ప్రచారం చేయకపోవడం వంటి బాధ్యతలను అవి నిర్దేశిస్తున్నాయి.
తప్పుదోవ పట్టిస్తే జరిమానా కూడా..
తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా ఎండార్సర్‌పైనా చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం కింద మొదటి ఉల్లంఘనకు రూ.10 లక్షల వరకు, పునరావృత ఉల్లంఘనకు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్దిష్ట కాలానికి ఎండార్స్‌మెంట్ చేయకుండా నిషేధించే చర్యలు కూడా ఉండొచ్చు.
అందుకే ఇకపై ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తి రుచి చూసి ‘వావ్’ అనడం మాత్రమే కాకుండా, దాని ఆరోగ్య ప్రయోజనాలు, స్వచ్ఛత, పోషక విలువలు వంటి అంశాలపై తాము చేసే ప్రతి క్లెయిమ్ వెనుక ఆధారం ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఫాలోవర్ల నమ్మకాన్ని ఉపయోగించి చేసే ప్రతి ఫుడ్ ప్రమోషన్‌కు బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుందని FSSAI తాజా హెచ్చరిక స్పష్టం చేస్తోంది.
With great influence comes great responsibility!
Before endorsing a food product, ensure that claims are truthful, verifiable & compliant with the law. Promoting misleading or unverified food claims can attract legal consequences.
Verify before you amplify.#FSSAIRegulations pic.twitter.com/t0UQzRTnPq— FSSAI (@fssaiindia) August 11, 2026


