ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, క్విక్ కామర్స్ వంటి డిజిటల్ వేదికల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ ఉద్యోగాల వలె పదవీ విరమణ ప్రయోజనాలు లేని ఈ అసంఘటిత రంగాన్ని జాతీయ పింఛను విధానం (ఎన్‌పీఎస్) పరిధిలోకి తీసుకురావడానికి ‘ఈ-శ్రామిక్’ (ప్లాట్‌ఫామ్ సర్వీస్ పార్ట్‌నర్) నమూనాను పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రచారం చేస్తోంది.
సరళమైన విరాళాల విధానం
గిగ్ కార్మికుల నెలవారీ ఆదాయంలో ఉండే హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను సులభతరంగా తీర్చిదిద్దారు. కార్మికులు కేవలం రూ.99 వంటి నామమాత్రపు చందాతో పొదుపును ప్రారంభించవచ్చు. అయితే, విరాళాలపై నిర్బంధ కనీస పరిమితి (మ్యాండేటరీ ఫ్లోర్) ఏదీ విధించలేదు. ఈ విధానంలో పొదుపు మొత్తాన్ని కార్మికుడు ఒక్కడే చెల్లించవచ్చు లేదా అగ్రిగేటర్ సంస్థ పూర్తిగా భరించవచ్చు లేదా ఇద్దరూ కలిసి సంయుక్తంగా జమ చేసే వెసులుబాటును కల్పించారు.
ఆధార్ కేవైసీ.. ఖాతా పోర్టబిలిటీ
అగ్రిగేటర్లతో అనుబంధం ఉన్న ‘పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్’(పీఓపీ)ల ద్వారా నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఆధార్ ఆధారిత కేవైసీ, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే చాలు కార్మికుడికి శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య (ప్రాన్) కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో ఉన్న ప్రధాన ప్రయోజనం.. పోర్టబిలిటీ. కార్మికుడు ఒక సర్వీస్ ప్లాట్‌ఫామ్ నుంచి మరొక దానికి మారినప్పటికీ అతడి పెన్షన్ ఖాతా యథాతథంగా కొనసాగుతుంది.
దేశీయ శ్రామిక శక్తిలో వేగంగా పెరుగుతున్న గిగ్ విభాగాన్ని అధికారిక సామాజిక భద్రతా వలయంలోకి చేర్చడానికి ఇది ఒక విప్లవాత్మక అడుగు. అయితే, ఎన్‌పీఎస్ రాబడులు మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉండటం, కార్మికులకు స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల క్రమబద్ధమైన విరాళాలు సేకరించడం ప్రధాన సవాలుగా మారవచ్చు. ఈ పథకం ఆశించిన విజయం సాధించాలంటే జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ వంటి అగ్రిగేటర్ సంస్థలు తమ పార్ట్‌నర్లలో అవగాహన పెంచి స్వచ్ఛందంగా ప్రొత్సహించడం చాలా అవసరం.
ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్‌కు యాడ్ మనీ!


