పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం | Baby Bust to Economic Bust What Global Birth Rate Drop Means Our Future | Sakshi
Sakshi News home page

పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం

Aug 13 2026 8:45 AM | Updated on Aug 13 2026 9:47 AM

Baby Bust to Economic Bust What Global Birth Rate Drop Means Our Future

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుండటం భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ప్రధాన సమస్యగా నిలిచిన చోట ఇప్పుడు వయోధిక వృద్ధులు ఎక్కువవడం, శ్రామిక శక్తి తగ్గుతుండడం సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1(ప్రతి మహిళకు) సంతానోత్పత్తి సగటు స్థాయి కంటే తక్కువకు జననాల రేటు పడిపోతుండటంతో అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

సామాజిక సంక్షేమ పథకాలు భారం

జనాభా నిష్పత్తిలో వస్తున్న ఈ మార్పు ప్రభుత్వాల బడ్జెట్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనిచేసే వయసున్న యువ శ్రామిక శక్తి తగ్గి, రిటైర్ అయ్యే వృద్ధుల సంఖ్య పెరగడంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం క్షీణిస్తోంది. అదే సమయంలో పెన్షన్ వ్యవస్థలు, ఉచిత వైద్య సేవలు, సామాజిక సంక్షేమ పథకాల నిర్వహణ భారం ప్రభుత్వాలపై విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల అనేక దేశాలు జాతీయ అప్పుల బారిన పడే ప్రమాదం ఏర్పడటంతో పాటు సామాజిక స్థిరత్వం కోసం కఠినమైన ఆర్థిక విధానాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఎక్కువ ఉత్పాదకతకు ప్రత్యామ్నాయాలు

ఈ శ్రామిక కొరత అంతర్జాతీయ పెట్టుబడుల సరళిని, సాంకేతిక వినియోగాన్ని కూడా వేగంగా మారుస్తోంది. తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పాదకతను సాధించేందుకు పరిశ్రమలు ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు, పెరుగుతున్న వయోవృద్ధుల జనాభాకు అనుగుణంగా హెల్త్‌కేర్, లాంగ్-టర్మ్ కేర్ ఫెసిలిటీస్, సీనియర్ కేర్ ఇన్సూరెన్స్ వంటి రంగాలకు మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు.

భారత్‌లో పరిస్థితి ఇలా..

భారతదేశంలో కూడా అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ ఇక్కడ స్పష్టమైన ప్రాంతీయ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే తక్కువ జనన రేటును నమోదు చేస్తున్నాయి. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ జనన రేటు అధికంగానే ఉంది. ఈ అసమానతల కారణంగా రాబోయే దశాబ్దాల్లో దేశీయ ఆర్థిక వృద్ధి ప్రక్రియ రాష్ట్రానికో రకంగా ఉండబోతోంది.

ఇప్పుడేం చేయాలంటే..

భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గిపోవడం వల్ల ఏర్పడే లోటును సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయకపోతే ఆర్థిక మందగమనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వయోభారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాలు తమ సామాజిక వ్యయ విధానాలు, వలస విధానాలను పునపరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. సరైన ఆర్థిక ప్రణాళికలతో ముందడుగు వేసినప్పుడే ఈ జనాభా సవాలును జయించడం సాధ్యమవుతుంది.

ఇదీ చదవండి: ప్రభుత్వ పాఠశాలల్లో 73% డ్రాపౌట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement