ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.
బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలు
పడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.
ఇతర దేశాలు ఇలా..
ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.
డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?
ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్‌లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.
నిజమైన ఖర్చులు ఇవే..
పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.
పెరుగుతున్న గృహాల ధరలు
కుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్‌ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.
ఆలస్యమవుతున్న వివాహాలు
ఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!
ఆధునిక మహిళ - పని వాతావరణం
నేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ అన్నారు.
ఇంటెన్సివ్ పేరెంటింగ్
నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్‌హుడ్‌ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.
గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)
యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.
| అడ్డంకులు/కారణాలు | శాతం (%) |
|---|---|
| ఆర్థిక పరిమితులు | 39% |
| ఉద్యోగ అభద్రత | 21% |
| గృహ సమస్యలు | 19% |
| సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు | 12% |
మనం నేర్చుకోవాల్సిన పాఠాలు
భారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్‌ఆర్) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్‌ఆర్ 1.9 కు పడిపోయింది.
1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
భారత్ ఏం చేయాలి?
సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్ కేర్, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.
ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం


