ఇంధన ధరకు బ్రేక్ | Excise Duty Cuts on Diesel Italy minister Meloni Move Amid Trump Iran Oil Crisis | Sakshi
Sakshi News home page

ఇంధన ధరకు బ్రేక్

Jul 28 2026 12:05 PM | Updated on Jul 28 2026 12:15 PM

Excise Duty Cuts on Diesel Italy minister Meloni Move Amid Trump Iran Oil Crisis

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్‌ అస్థిరతకు లోనవుతున్న తరుణంలో ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరిగిన ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మేలోని నేతృత్వంలోని కేబినెట్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 17 యూరో సెంట్లు తగ్గిస్తూ అత్యవసర డిక్రీని ఆమోదించింది.

పన్ను కోతతో ఊరట

పశ్చిమాసియాలో రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు చమురు సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పర్యవసానంగా యూరప్‌ ఖండంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, గృహ అవసరాలకు అత్యంత కీలకమైన డీజిల్ ధరలు లీటరుకు రెండు యూరోలు దాటడం వల్ల ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉంది. ఈ ఆర్థిక భారం నుంచి పౌరులను, వ్యాపారాలను కాపాడేందుకు ఇటలీ ప్రభుత్వం ‘మొబైల్ ఎక్సైజ్ డ్యూటీ’ యంత్రాంగాన్ని ప్రారంభించి, అదనపు వ్యాట్ రాబడిని పన్ను తగ్గింపునకే వినియోగిస్తోంది.

క్రూడాయిల్ ధర పెరగడం వల్ల పెట్రోల్/డీజిల్ ధర పెరిగి ప్రభుత్వం ఖాతాలోకి వ్యాట్ రూపంలో అదనంగా ఆదాయం వస్తుంది. ఇటలీ ప్రభుత్వం ఆ అదనపు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోకుండా లీటరుపై విధించే ఎక్సైజ్ సుంకాన్ని (17 యూరో సెంట్లు) తగ్గించడానికి ఉపయోగించింది. అంటే.. ఒక వైపు వ్యాట్ ద్వారా వచ్చిన లాభాన్ని, మరోవైపు ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వడానికి ఉపయోగిస్తుంది.

రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రభావం

ఇటలీ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణా, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమైనవి. లారీలు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లు ఎక్కువగా డీజిల్‌పైనే ఆధారపడటంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై తీవ్ర భారం పడింది. ట్రంప్ ఇరాన్‌పై చేపట్టిన సైనిక, దౌత్య ఒత్తిళ్ల కారణంగా గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. జర్మనీ, ఇటలీ వంటి పెట్రోలియం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఐరోపా పారిశ్రామిక దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

‘ఈ ధరల పెరుగుదలకు మేం కారణం కాకపోయినప్పటికీ పౌరులను కాపాడుకోవడం మా బాధ్యత. ఇది ప్రతి సమస్యకూ శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు. కానీ సమయానుకూల, బాధ్యతాయుతమైన స్పందన’ అని ప్రధాని మేలోని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో యుద్ధ పరిస్థితులు సద్దుమణగకపోతే విద్యుత్తు, గ్యాస్ బిల్లులపై కూడా రాయితీలు ప్రకటించేందుకు ఇటలీ కేబినెట్ సమాయత్తమవుతోంది.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement