సబ్సిడీల కోతతో ‘ఈ-బస్’ ఆపరేటర్లకు ఆర్థిక సెగ | India E-Bus Crisis: How Falling Subsidies & Funding Crunch Stall Electric Bus Expansion | Sakshi
Sakshi News home page

సబ్సిడీల కోతతో ‘ఈ-బస్’ ఆపరేటర్లకు ఆర్థిక సెగ

Aug 13 2026 1:26 PM | Updated on Aug 13 2026 1:35 PM

India E-Bus Crisis Why Falling Subsidies Funding Crunch Stall Electric Buses

దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ బస్సుల (ఈ-బస్‌) విస్తరణ ప్రక్రియ కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఫేమ్‌ పథకం కింద అందించిన ప్రత్యక్ష కొనుగోలు సబ్సిడీలు క్రమంగా తగ్గుతుండటంతో ఈ-బస్ ఆపరేటర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొత్త పథకాలైన ‘పీఎం ఈ-డ్రైవ్’, ‘పీఎం-ఈబస్ సేవా’ల్లో ప్రభుత్వం నేరుగా సబ్సిడీలు ఇవ్వడానికి బదులు నిధుల సురక్షిత విధానాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆపరేటర్లకు మూలధన సేకరణ సవాలుగా మారింది.

ఆర్థిక భారం.. నిర్వహణ సవాళ్లు

ఒక సాధారణ డీజిల్ లేదా సీఎన్‌జీ బస్సు వ్యయంతో పోలిస్తే 12 మీటర్ల ఈ-బస్ ధర రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుంది (దాదాపు 2.5-3 రెట్లు ఎక్కువ). ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సబ్సిడీ తగ్గిపోవడంతో రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే, బ్యాంకులు ఇచ్చే రుణ కాలపరిమితి కేవలం 5-7 ఏళ్లు మాత్రమే ఉండటం, 7-8 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ వ్యయంతో బ్యాటరీ మార్పిడి చేయాల్సి రావడం ఆపరేటర్ల లాభదాయకతను దెబ్బతీస్తోంది.

పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం

రాష్ట్ర రవాణా సంస్థల నుంచి బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి పెట్టుబడిదారుల్లో నమ్మకం నింపేందుకు ప్రభుత్వం రూ.3,435 కోట్ల వ్యయంతో పీఎస్‌ఎంను అందుబాటులోకి తెచ్చింది. ఇది దాదాపు 27,555 బస్సులకు క్రెడిట్ గ్యారెంటీని ఇస్తున్నప్పటికీ ప్రాథమిక మూలధన కొరతను తీర్చడంలో ఇది పాక్షిక ప్రయోజనాన్నే ఇస్తోంది.

పరిష్కారాలు.. నిపుణుల అభిప్రాయం

రేటింగ్ సంస్థ ఇక్రా నివేదికల ప్రకారం.. దీర్ఘకాలిక నిర్వహణ వ్యయం పరంగా డీజిల్ బస్సుకు కిలోమీటరుకు రూ.51 ఖర్చయితే ఈ-బస్సుకు రూ.39 మాత్రమే అవుతుంది. ఈ ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా 2030 నాటికి దేశీయ బస్సు మార్కెట్‌లో ఈ-బస్సుల వాటాను 30 శాతానికి చేర్చాలన్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ-బస్ ఫైనాన్సింగ్‌ను ప్రాధాన్యతా రంగ రుణాల పరిధిలోకి తీసుకురావాలి.

  • బ్యాంకులు రుణాల తిరిగి చెల్లింపు కాలపరిమితిని 10-12 ఏళ్లకు పెంచాలి.

  • ప్రైవేట్ రవాణా రంగానికి కూడా మౌలిక వసతుల కల్పనలో దీర్ఘకాలిక రుణ సదుపాయాలు కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement