టాటా సన్స్ నూతన సారథి ఎవరు? | Who is TV Narendran? Meet the Contender to Head Tata Empire After Chandrasekaran | Sakshi
Sakshi News home page

టాటా సన్స్ నూతన సారథి ఎవరు?

Aug 13 2026 12:51 PM | Updated on Aug 13 2026 12:58 PM

Who is TV Narendran? Meet the Contender to Head Tata Empire After Chandrasekaran

భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20తో తన పదవీ కాలాన్ని ముగించి బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో కార్పొరేట్ ప్రపంచంలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. బోర్డులో సర్వామోదం లభించకపోవడం, ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో వ్యూహాత్మక విధానాలపై ఏర్పడిన వ్యత్యాసాల నేపథ్యంలో ‘చంద్ర’గా ప్రాచుర్యం పొందిన ఆయన మూడోసారి పదవీకాలాన్ని కోరకూడదని నిశ్చయించుకున్నారు. తొమ్మిదేళ్ల తన హయాంలో సెమీకండక్టర్లు, ఈవీ రంగాలు, ఎయిర్ ఇండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల్లో గ్రూప్‌ను నూతన శిఖరాలకు చేర్చిన ఆయన సజావుగా నాయకత్వ మార్పిడి జరిగేలా త్వరలోనే వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని బోర్డును కోరారు.

టాటా సన్స్ నిబంధనావళి (ఆర్టికల్ 118) ప్రకారం నూతన ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డు ప్రతినిధులతో కూడిన ఐదుగురు సభ్యుల హై-పవర్ సెలేక్షన్ కమిటీ కొద్దిరోజుల్లో ఏర్పాటవుతోంది.

ఈ వారసత్వ రేసులో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టీవీ నరేంద్రన్ (61) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టాటా గ్రూప్‌లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నరేంద్రన్.. సంక్షోభంలో ఉన్న భూషణ్ స్టీల్ విలీనాన్ని విజయవంతంగా ముగించారు. అంతేకాకుండా, కళింగనగర్ ప్లాంట్ విస్తరణ, యూరప్‌లో గ్రీన్ స్టీల్ దిశగా వేగవంతమైన పరివర్తనను సాధించి, టాటా స్టీల్‌ను స్థిరమైన లాభాల బాట పట్టించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆయనకున్న పట్టు, కార్యనిర్వాహక సామర్థ్యం ఆయనను కీలకంగా నిలబెట్టాయి.

నరేంద్రన్‌తో పాటు టీసీఎస్ సీఈఓ కే.కృతివాసన్, జేఎల్‌ఆర్ సీఈఓ పి.బి.బాలాజీ, టాటా మోటార్స్ ఈవీ విభాగాధిపతి శైలేష్ చంద్రల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రూప్‌లోని ఎగ్జిక్యూటివ్ రిటైర్మెంట్ వయోపరిమితి (65 ఏళ్లు) నిబంధన, 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ దృక్పథానికి పూర్తిగా అనుగుణంగా నడుచుకునే నేతను ఎంచుకోవడం బోర్డు ముందున్న ప్రధాన సవాలు. 280 బిలియన్ డాలర్ల సమూహానికి అంతర్గత నాయకుడే ప్రాతినిధ్యం వహిస్తారా లేక వెలుపలి నుంచి మరోవ్యక్తిని రంగంలోకి దించుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్‌కు యాడ్ మనీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement