మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు సమీపంలోని పసిఫిక్ తీరంలో సంభవించిన భారీ భూకంపం మధ్య అమెరికా దేశాలను వణికించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం మెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లో బలంగా నమోదైంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం నమోదుకాలేదు.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం, ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం భూమి లోపల సుమారు 15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య పలు ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయి.
సునామీ హెచ్చరికలు.. తీర ప్రాంతాల్లో అప్రమత్తత
భూకంపం సముద్రంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ, మెక్సికో అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికో నేవీ ప్రజలను తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. సుమారు ఆరు గంటల పాటు బీచ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
మెక్సికో, గ్వాటెమాల తీరాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదని తర్వాత స్పష్టం చేశారు.
భయంతో పరుగులు తీసిన ప్రజలు
చియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రత పెరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ.. "మొదట ఇది సాధారణ ప్రకంపన అనుకున్నాం. కానీ క్రమంగా తీవ్రత పెరగడంతో అందరం భవనం నుంచి బయటకు వచ్చాం" అని తెలిపారు.
గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఇద్దరికి గాయాలు
మెక్సికోలోని తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఓ హైతీ వలస మహిళ భయంతో ఓ అపార్ట్‌మెంట్ భవనం నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఓ దుకాణం అద్దం పగిలి స్వల్ప గాయాలయ్యాయి.
మెక్సికో అధ్యక్షురాలి స్పందన
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినప్పటికీ అక్కడ భూకంప హెచ్చరిక వ్యవస్థ పనిచేయలేదు. భూకంపం ప్రారంభ దశలో నమోదైన శక్తి హెచ్చరిక స్థాయిని దాటలేదని అధికారులు వివరించారు.
గ్వాటెమాలలో పాఠశాలలు మూసివేత
గ్వాటెమాల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. శాన్ మార్కోస్, క్వెట్జాల్టెనాంగో తదితర భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్‌క్రాస్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపి నష్టాన్ని అంచనా వేస్తోంది.
భూకంపాలకు సున్నితమైన ప్రాంతం
మెక్సికో, గ్వాటెమాల ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది.
తాజా భూకంపం మూడు దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్‌షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


