అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పాత పాటే పాడిన ఆయన.. ఈసారి ఆసియా దేశమైన చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల సంఖ్యలో అమెరికన్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశం దొంగిలించిందని ఆరోపించారు. అంతేకాదు అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach)గా దీనిని అభివర్ణించారు.
అమెరికా ప్రైమ్ టైమ్ స్పీచ్‌లో భాగంగా.. ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్నికల భద్రతపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోట్ల 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్ల డేటాను చైనా చోరీ చేసిందన్నారు. ఇటీవల గోప్యత నుంచి తొలగించిన (డీక్లాసిఫై చేసిన) నిఘా పత్రాల్లో చైనా భారీ స్థాయిలో అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని చెప్పారు. ఆ డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారాన్ని ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
#WATCH | US President Donald Trump says, "The documents cover five major areas of concern. They show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in… pic.twitter.com/V8efjdVqT1
— ANI (@ANI) July 17, 2026
'డీప్ స్టేట్ నిజాలను దాచింది'
అమెరికా ఎన్నికల వ్యవస్థపై దాడి చేసే సామర్థ్యం చైనాతో పాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌కు ఉందని అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారం తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్‌బీఐ, సీఐఏలను ఆదేశించినట్లు వెల్లడించారు. సమాచారం దాచిన వారిపై ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.
మళ్లీ అదే మాట
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో అనేక బలహీనతలు బయటపడ్డాయని ఆరోపించారు. అమెరికా ఎన్నికల భద్రతను బలోపేతం చేయాలంటే కఠినమైన ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి?
భవిష్యత్తులో ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల నమోదు సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఫొటో ఐడీ లేకుండా ఓటు హక్కు కల్పించకూడదని, రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ లక్ష్యంతో రిపబ్లికన్లు మద్దతిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధారాలు చూపలేదు.. నిఘా వర్గాల వేర్వేరు అభిప్రాయాలు
అయితే తన ప్రసంగంలో ట్రంప్ ఈ ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా నిఘా వర్గాలకు చెందిన కొన్ని సమాచారం ప్రకారం.. చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదంటే ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అలాగే 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, అమెరికా కోర్టులు, రీకౌంట్లు, అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగుచూడలేదని గతంలో తేలింది. అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని ట్రంప్ మరోసారి జాతీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.


